||తెలంగాణ సీఎం కేసీఆర్||
యావత్తు దేశం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటున్న వేళ తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప శుభవార్తను అందించారు. రైతులకు చెందిన రూ.లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేశారు. సోమవారం ఒకే రోజున 10,79,721 మంది రైతులకు చెందిన రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 16.16 లక్షల మంది రైతుల రుణాలు రూ.7,753 కోట్లు మాఫీ అయ్యాయి. ఆగస్టు 2వ తేదీన జరిగిన హైలెవెల్ మీటింగ్‌లో రుణమాఫీపై సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మరుసటి రోజు నుంచే రుణ మాఫీ ప్రారంభించింది. తొలి రోజున రూ.41వేల లోపు 62,758 మంది రైతుల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ తర్వాత విడతల వారీగా రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం.. రూ.99,999 లోపు రైతుల రుణాలన్నీ సోమవారం ఒకేసారి మాఫీ చేసింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రుణమాఫీ ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బును వెంటనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం డబ్బు రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకులకు చేరుతుంది.