తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వైద్య సదుపాయాలను మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామన్నారు.
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వైద్య సదుపాయాలను మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి ఇవాల( శుక్రవారం) సీఎం శంకుస్థాపన చేశారు. ఒక్కో స్కూల్ భవనాన్ని రూ.25 కోట్లతో 150 ఎకరాల్లో నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కొందుర్గులో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. చదువుకున్న విద్యార్థుల కొలువుల గురిచి కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. పేదలంతా గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ బతకాలని కేసీఆర్ భావించారని విమర్శించారు.
గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10,006 పోస్టులు డీఎస్సీ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు ఉద్యోగ ఉన్నతి ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందని, గత ప్రభుత్వం అనేక స్కూల్స్ పెట్టిందే తప్ప పక్క వసతి కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు.
ఇందిరమ్మ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో 125 నుంచి 150 కోట్లతో అద్భుతమైన పాఠశాల భవనాలను నిర్మాణం చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.300 కోట్లతో అనేక కంపెనీలతో స్కిల్ డవలప్ మెంట్ నైపుణ్యం పెంపొందించే అవకాశం కలిపించిందన్నారు. మాటలతో కాదు ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందని.. ప్రైవేటుకు దీటుగా పేద విద్యలకు కార్పొరేట్ విద్యానందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మోడల్‌ను ఇప్పటికే ఖరారు చేశామని తెలిపారు సీఎం రేవంత్. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, తరగతి గదులు, ప్రయోగశాలలు, ఆట స్థలం, బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ సిబ్బందికి నివాస సముదాయాలు ఏర్పాటు చేసేలా నమూనా రూపొందించామన్నారు. తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, యాంప్ థియేటర్ వంటి అధునాత సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం క్రికెట్ గ్రౌండ్, ఫుట్‌బాల్ కోర్టు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ కోర్టులతో పాటు ఔట్‌డోర్ జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.