రుషికొండ భవనాలపై టిడిపి తప్పుడు ప్రచారం : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

రుషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు టిడిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండపై కట్టిన భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Gudivada Amarnath

గుడివాడ అమర్నాథ్


రుషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు టిడిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండపై కట్టిన భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రుషికొండపై నిర్మించిన భవనాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తరువాత రుషికొండ నిర్మాణంపై త్రీ మెన్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశామన్నారు. కమిటీ ఓకే అన్న తరువాతనే రుషికొండపై భవనాలను నిర్మించినట్లు మాజీ మంత్రి అమర్నాథ్ వివరించారు. టిడిపి నేతలు వైయస్ జగన్, వారి కుటుంబంపై బురద చల్లాలని చూడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసన్నారు. హైదరాబాదులో ఇల్లు నిర్మించుకున్న సమయంలో చంద్రబాబు ప్రైవేట్ హోటల్లో ఉండి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన విషయం నిజం కాదా..? అని ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే వైయస్ జగన్ రుషికొండపై శాశ్వత భవనాలు నిర్మించారన్నారు. టిడిపి నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూపించాలన్నారు. ఇప్పటికైనా టిడిపి నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలన్న విషయాన్ని టిడిపి నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను కూడా గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టిన ప్రభుత్వ భవనాలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై దృష్టి సారించాలి తప్ప ఈ తరహా దుష్ప్రచారాలతో ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు మాదిరిగా వినియోగించుకునేందుకు ఈ భవనాన్ని కట్టారన్నట్టుగా ప్రచారం చేయడం తగదన్నారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వానికే ఉంటుందని, ప్రభుత్వం మారిన తర్వాత కూడా వ్యక్తులకు ఈ ఆస్తులు ఉండవన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అడ్డగోలు ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ తరహా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయడం దిశగా ఆలోచన చేయాలని, వైసిపి ప్రభుత్వం చేసిన పనులపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్