ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పై విడుదలై బయటకు వచ్చారు. సుమారు 6 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన ఆయన సుదీర్ఘ పోరాటం అనంతరం బెయిల్ సాధించారు. బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఈ ప్రకటన ప్రస్తుతం రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ప్రకటన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని బలహీనపరుస్తున్న, విభజించే ప్రయత్నాలు చేస్తున్న శక్తులపై తాను పోరాటం చేస్తానని ప్రతినబూనారు.
అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పై విడుదలై బయటకు వచ్చారు. సుమారు 6 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన ఆయన సుదీర్ఘ పోరాటం అనంతరం బెయిల్ సాధించారు. బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఈ ప్రకటన ప్రస్తుతం రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ప్రకటన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని బలహీనపరుస్తున్న, విభజించే ప్రయత్నాలు చేస్తున్న శక్తులపై తాను పోరాటం చేస్తానని ప్రతినబూనారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేసిన కేజ్రీవాల్.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆప్ ను గెలిపించి అధికారం కట్టబెట్టే వరకు సీఎం పీఠాన్ని అధిరోహించని స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రకటన వెనక అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ వ్యూహాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో హర్యానా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఇరుగుపొరుగున ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడం ద్వారా తాము మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నామన్న సంకేతాలను ఇతర పార్టీలకు ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. అదే సమయంలో తన అరెస్టు అనైతికం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని ఆయన తీసుకున్నట్లు చెబుతున్నారు. హర్యానా ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే ఉద్దేశంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నప్పటికీ సీఎం కార్యాలయానికి వెళ్లే అవకాశం లేకుండా, కీలక ఫైళ్ళపై సంతకాలు చేసే వీలు లేకుండా కోర్టు బెయిల్ ఇచ్చే సందర్భంగా కొన్ని నిబంధనలను విధించింది.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో కొనసాగడం కంటే మరొకరికి ఆ బాధ్యతలను అప్పగించి ఎన్నికల జరుగుతున్న హర్యానా రాష్ట్రంలో పార్టీ ప్రచారానికి పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించడం వలన మెరుగైన ఫలితం ఉంటుందని కేజ్రీవాల్ భావించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా సానుభూతిని పొందవచ్చని వ్యూహం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గతసారి జరిగిన హర్యానా ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా ఆప్ ప్రభావాన్ని చూపించలేకపోయింది. నోటా కంటే కాస్త అధికంగా మాత్రమే ఓట్లను ఆ పార్టీ సాధించింది. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం బలమైన శక్తిగా ఆవిర్భవించాలన్న ఉద్దేశంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో కేజ్రీవాల్ ప్రచారాన్ని గనుక చేస్తే మెరుగైన స్థానాలను సాధించి కింగ్ మేకర్ గా ఇక్కడ ఆప్ అవతరించే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రైతు ఉద్యమాల నేపథ్యంలో హర్యానాలో బిజెపికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. హర్యానాపై తమ పార్టీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, ఫలితాలను తారుమారు చేసి ఆప్ కు పట్టం కట్టే దిశగా కేజ్రీవాల్ పక్కా వ్యూహంతో ఉన్నట్టు సమాచారం. హర్యానాలో పొత్తుపై ఇండియా కూటమితో చర్చలు విఫలమవడంతో ఒంటరి పోరుకు కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. 2013లో అనూహ్యంగా ఢిల్లీ పీఠం దక్కించుకున్న తరువాత వరుసగా ఆప్ అధికారం చేపడుతూ వస్తోంది. పంజాబ్ లో పాగా వేసి, గోవాలో ఓట్ల శాతాన్ని కూడా ఆప్ పెంచుకుంది. ఈ క్రమంలోనే ఆప్ జాతీయ పార్టీగా ఎదిగింది. హర్యానాలో పాగా వేసినా, చెప్పుకోదగ్గ సీట్లు సాధించిన ఆప్ జాతీయ పార్టీ హోదాకు మరో నాలుగు ఐదు ఏళ్ళు డొకా ఉండకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే కేజ్రీవాల్ వ్యూహంగా కనిపిస్తోంది. ఓట్ల శాతాన్ని పెంచుకోవడంతోపాటు కనీస స్థాయిలో సీట్లను సాధించడం ద్వారా ఈ రాష్ట్రంలో కింగ్ మేకర్ స్థానాన్ని అధిరోహించాలని అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలను పన్నుతున్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు ఎంతవరకు విజయాన్ని చేకూరుస్తాయో చూడాల్సి ఉంది.