ఇద్దరు ఎస్పీలపై సహా 12 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు.. మరో ఇద్దరు బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.

సస్పెండ్ అయిన ఎస్పీలు బిందు మాధవ్, అమిత్
సస్పెండ్ అయిన ఎస్పీలు బిందు మాధవ్, అమిత్

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. పోలింగ్ అనంతరం పల్నాడు, అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలను నియంత్రంచాల్సిన పోలీస్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పల్నాడు జిల్లా ఎస్పీ గరికపాటి బిందు మాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పై సస్పెన్షన్ వేటు విధించాలని ఈసీ ఆదేశించింది. పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్, తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ను బదిలీ చేయాల్సిందిగా ఈసీ సూచించింది. వీరితోపాటు తిరుపతి జిల్లా డిఎస్పి ఏ సురేందర్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ కె రాజశేఖర్, ఎస్బి డిఎస్పి ఎం భాస్కర్ రెడ్డి, అలిపిరి సిఐ ఓ రామచంద్రారెడ్డి ని సస్పెండ్ చేయాల్సిందిగా ఈసీ ఆదేశించింది. పల్నాడు జిల్లాకు సంబంధించి గురజాల డిఎస్పి ఏ పల్లపురాజు, నరసరావుపేట డిఎస్పి విఎస్ఎన్ వర్మ, స్పెషల్ బ్రాంచ్ సిఐ కె ప్రభాకర్ రావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఈ బాల నాగిరెడ్డి, కారంపూడి ఎస్సై ఎం రామాంజనేయులు, నాగార్జునసాగర్ ఎస్ఐ డివి కొండారెడ్డినీ సస్పెండ్ చేయాల్సిందిగా ఈసీ డీజేపీకి సూచించింది. అనంతపురం జిల్లాకు సంబంధించి తాడిపత్రి డిఎస్పి సీఎం గంగయ్య, తాడిపత్రి సిఐ ఎస్ మురళీకృష్ణను సస్పెండ్ చేయాల్సిందిగా డిజీపిని ఈసీ ఆదేశించింది. పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలకు ఈ 12 మంది పోలీస్ అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యమే కారణమని డిజిపి హరీష్ గుప్తా స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో ఈ అధికారుల విఫలమయ్యారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని డిజిపి స్పష్టం చేశారు. ఆయా ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంలో వీరు పూర్తిగా విఫలమయ్యారని, చట్టపరమైన విధులు నిర్వహించడంలో వీరి సమగ్రత అనుమానాస్పదమని డిజిపి పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్