Supreme on Demonetisation | మోదీ సర్కారు నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


||Pic: సుప్రీం కోర్టు||

ఈవార్తలు, నేషనల్ న్యూస్ : కేంద్రంలోని మోదీ సర్కారు 2016 నవంబర్ 8వ తేదీన తీసుకొన్న నోట్ల రద్దు నిర్ణయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతించింది. ఆ నాడు తీసుకొచ్చన నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. అయితే, ఒక్క న్యాయమూర్తి మాత్రం కేంద్రం చర్యలను తప్పుబట్టారు. నోట్ల రద్దు నిర్ణయంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎన్‌ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఈ కీలక తీర్పు వెలువరించింది. కీలక లక్ష్యాలతోనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకొన్నారని ధర్మాసనంలోని నలుగురు సభ్యులు తీర్పు చెప్పగా, ఆ విషయంలో కేంద్రం వైఖరి సరిగా లేదని ఓ న్యాయమూర్తి తెలిపారు. దీంతో 4-1 తేడాతో తీర్పు కేంద్రానికి అనుకూలంగా వచ్చింది.


‘రూ.1,000, రూ.500 పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకొన్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదు. ఆర్బీఐ, కేంద్రం మధ్య సంప్రదింపులు జరిగాకే ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని జస్టిస్ గవాయ్ తెలిపారు. అయితే, లక్ష్యాలను చేరుకోవటంలో కొన్ని తేడాలు ఉన్నట్టు పేర్కొన్నారు. జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ ‘నోట్ల రద్దు నిర్ణయంపై ప్రభుత్వం గెజిట్ ద్వారా మాత్రమే కాకుండా పార్లమెంట్‌లో చర్చించి చట్ట రూపంలో నిర్ణయం వెలువరించాల్సింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని బ్లాక్ మనీ, టెర్రర్ ఫండింగ్, దొంగ నోట్లను లక్ష్యంగా చేసుకొని చేపట్టారు. కానీ, ఆ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోకుండా చట్టవిరుద్ధంగా చర్యలు తీసుకొన్నారు. చర్యలు తీసుకోవాల్సింది ఆర్బీఐ. కేంద్రం కాదు. కానీ, 2016లో అందుకు విరుద్ధంగా జరిగింది. ఆ నిర్ణయం లోపభూయిష్టంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. 2016లో తీసుకొన్న నిర్ణయం కాబట్టి, ఇప్పుడు దీనిపై స్టే ఇవ్వలేమని, పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం కలగదని తేల్చి చెప్పారు.


అటు.. ధర్మాసనం నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. అటు.. పాత నోట్లకు మార్చుకొనేందుకు గడువు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా సుప్రీం తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందిస్తూ.. కేంద్రం చట్టవిరుద్ధంగా చర్యలు తీసుకొన్నదని తీర్పు చెప్పిందని, ఇది మోదీ సర్కారుకు చెంప దెబ్బ అని అన్నారు.


సుప్రీం తీర్పు(4-1)లో కీలక వ్యాఖ్యలు:

మెజారిటీ ధర్మాసనం:

- నోట్ల రద్దు నిర్ణయం లోపభూయిష్టంగా లేదు

- ఎగ్జిక్యూటివ్ ఎకానమీ పాలసీ ఇది

- నిర్ణయం తీసుకొనే 6 నెలల ముందే  ఆర్బీఐని కేంద్రం సంప్రదించింది.

- ఈ నిర్ణయంలో ఎలాంటి చట్టబద్ధమైన, రాజ్యాంగ బద్ధమైన ఉల్లంఘనలు జరగలేదు.

- అయితే, లక్ష్యసాధనలో కొంత తేడాలు కనిపించాయి. కానీ, రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించలేం.


మైనారిటీ ధర్మాసనం: (జస్టిస్ నాగరత్న)

- నోట్ల రద్దు నిర్ణయం లోబభూయిష్టంగా ఉంది

- గెజిట్ ద్వారా నిర్ణయం ఎలా తీసుకుంటారు? పార్లమెంట్‌లో చర్చించి చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాలి.

- నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్బీఐ కదా తీసుకోవాలి. కేంద్రం ఎలా తీసుకుంటుంది?

- అయితే, నల్లధనం, టెర్రర్ ఫండింగ్ వంటి మంచి లక్ష్యాల కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.





సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్