మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అల్లు అర్జున్ Photo: Facebook
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం కూటమికి మద్దతు తెలపగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం వైసీపీకి మద్దతు తెలిపారు. తానే స్వయంగా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి కోసం ప్రచారంలో పాల్గొన్నారు కూడా. తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఆయన నంద్యాలలో ప్రచారం నిర్వహించారు. అప్పుడు ఇది పెద్ద దుమారమే రేగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు అల్లు అర్జున్ తీరును తీవ్రంగా ఖండించారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒకానొక సందర్భంలో అసహనం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా బన్నీని టార్గెట్ చేశారు. అప్పటి నుంచి బన్నీపై వ్యక్తిగతంగా దూషణలు పెరుగుతూనే ఉన్నాయి. అయినా ఎక్కడా అల్లు అర్జున్ తనపై విమర్శలపై స్పందించలేదు.
అయితే, తాజాగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాను ఉద్దేశించే మాట్లాడినా.. తాను పరోక్షంగా తనపై వస్తున్న విమర్శలకు దీటైన కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. ‘నచ్చిన వాళ్ల కోసం నిలబడాలి. నేను నిలబడతా. నా అనుకున్న వాళ్ల కోసం ఎంత కష్టమైనా నిలబడాలి. నా అనుకునే వాళ్లకోసం ఎంత దూరమైనా వస్తా. కచ్చితంగా వస్తా. ఈ ఈవెంట్‌కు రావటానికి ముఖ్య కారణం సుకుమార్ భార్య తబిత. నా అనుకున్నవాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుంది. ఆమె వచ్చిన అడిగిన తర్వాత నో చెప్పలేకపోయా’ అని స్పష్టం చేశాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. నా అనుకున్నవాళ్ల కోసం నిలబడటం గొప్ప నిర్ణయమని, బన్నీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బన్నీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. నా అనుకొనే.. ఎన్నికల్లో శిల్పా రవిచంద్రారెడ్డి కోసమే బన్నీ నంద్యాలలో ప్రచారం నిర్వహించారని గుర్తుచేస్తున్నారు.