సీఎం చంద్రబాబు నాయుడుకు కుప్పం, వైయస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల నియోజకవర్గం వర్గాలు మాదిరిగా.. తనకు ఒక నియోజకవర్గం ఉండాలని భావించిన పవన్ కళ్యాణ్ ఇందుకు పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. అలా బలంగా ఇక్కడి ప్రజలు ఆయన వెంట ఉండాలంటే అభివృద్ధిని పరుగులు పెట్టించాలని భావించినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఆ హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ది విలక్షణ శైలి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి సుమారు 15 ఏళ్లు గడుస్తోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించినప్పుడు యాక్టివ్ గా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ తరువాత నుంచి కొనసాగుతూనే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కొన్నాళ్లు పాటు మౌనం దాల్చిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మళ్లీ జనసేన పార్టీని స్థాపించి రాజకీయంగా మరింత యాక్టివ్ అయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆయన.. 2019 ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించి ఘోరమైన ప్రతికూల ఫలితాలను చవిచూశారు. అయితే ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ఆయన 2024 ఎన్నికల్లో మాత్రం కూటమిగా టిడిపి, బిజెపితో కలిసి బరిలోకి దిగి మంచి విజయాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలను చేపట్టారు. అయితే ఆయన తన భవిష్యత్తు రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కీలక అడుగులు వేస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగాలంటే తమకు అండగా నిలబడే ప్రజలు ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఇదే సూత్రాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారు. ఎందుకంటే గతంలో చిరంజీవి పాలకొల్లు, తిరుపతి వంటి నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి దారుణమైన రీతిలో పరాభవాన్ని మూటగట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తనకు మంచి మెజారిటీని అందించిన ఈ నియోజకవర్గాన్ని తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించేందుకు కేంద్రంగా ఎంచుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది.
ఏ రాజకీయ నాయకుడు అయిన సుదీర్ఘకాలం పాటు గొప్ప నేతగా ఎదగాలి అనుకుంటే తొలుత తాము పోటీ చేసే నియోజకవర్గంలో బలంగా ఉండాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బలంగా నిలబడేందుకు కారణమైన పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన ఇందుకోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడుకు కుప్పం, వైయస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల నియోజకవర్గం వర్గాలు మాదిరిగా.. తనకు ఒక నియోజకవర్గం ఉండాలని భావించిన పవన్ కళ్యాణ్ ఇందుకు పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. అలా బలంగా ఇక్కడి ప్రజలు ఆయన వెంట ఉండాలంటే అభివృద్ధిని పరుగులు పెట్టించాలని భావించినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఆ హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల కిందట అధికారులు పార్టీ నేతలతో కలిసి పిఠాపురంలో తిరిగిన పవన్ కళ్యాణ్ అక్కడి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వీటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ రోడ్డు సదుపాయాలు కల్పించడంతోపాటు మంచినీటి సౌకర్యాలు కల్పించేందుకు ఆయన చర్యలు చేపట్టారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోని 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకు ఆదేశాలను జారీ చేయించారు. ఇందుకోసం రూ.38 కోట్ల రూపాయల నిధులను కూడా ఆయన విడుదల చేయించారు. పిఠాపురం ప్రజలు వైద్య అవసరాల కోసం ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు. దీనివల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడం ఆయన దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఆసుపత్రిని ఆధునీకరించడంతోపాటు అప్గ్రేడ్ చేయించే ప్రక్రియను ఆయన వేగంగానే పూర్తి చేశారు. వీటితోపాటు పిఠాపురం ప్రజలు గత కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పైన ఆయన దృష్టి సారించినట్లు చెబుతున్నారు. రాడ్లను బాగు చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రత్యేకంగా ఆయన దృష్టి సారించారు.
పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ అడుగులను చూస్తుంటే సుదీర్ఘ కాలం పాటు పిఠాపురాన్ని కేంద్రంగా చేసుకొని రాజకీయాలను సాగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే టిడిపి కీలక నేత ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వర్మకు ఇబ్బందికర పరిస్తితులు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో టిడిపి జనసేన మధ్య అనేక చోట్ల గొడవలు జరుగుతున్నాయి. తాజా కార్యక్రమాలు పట్ల వర్మ ఒకింత అసహనానికి గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వర్మ ఈ నియోజకవర్గంలో గడిచిన కొన్నాళ్లుగా రాజకీయాలను సాగిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అయితే పొత్తులో భాగంగా సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ప్రతిసారి ఇదే తరహాలో త్యాగం చేయడానికి ఆయన అంగీకరించకపోవచ్చు. ఎక్కడ ఆయనకంటూ ఒక బలం, బలగం ఉంది. ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కూడా ఆయన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ కార్యకలాపాలు పట్ల ఆయన ఎలా స్పందిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలపడేందుకు వేస్తున్న అడుగులు ఎంతవరకు సఫలం అవుతాయో.