||ప్రతీకాత్మక చిత్రం Photo: Twitter||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్ : నైరుతి రుతుపవనాలు (southwest monsoon) జూన్ 4న కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత వారం పది రోజులకు తెలంగాణలోకి విస్తరించనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల రాకతో ఎండలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది. అయితే, చిరుజల్లులు పడుతున్నాయని రైతులు తొందరపడి విత్తనాలు నాటవద్దని సూచించింది. చిరుజల్లులకు విత్తనాలు భూమిలోపల ఉడికిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తేమ కనిపించిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని స్పష్టం చేసింది. అటు.. తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన వానలు పడతాయని వివరించింది.