నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారంలో నైరుతి రుతు పవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. కానీ, ఈ సారి రెండు వారాల ముందుగానే తెలంగాణను తాకాయి.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ, ఈవార్తలు : నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారంలో నైరుతి రుతు పవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. కానీ, ఈ సారి రెండు వారాల ముందుగానే తెలంగాణను తాకాయి. ఆదివారం ఆంద్రప్రదేశ్‌లోని రాయలసీమలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. సోమవారం తెలంగాణను చేరాయి. ఇవి నాగర్ కర్నూలు, గద్వాల, నల్లగొండ మీదుగా రాష్ట్రంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు వానలు పడతాయని తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని చెప్పింది.
ఇక, రేపటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా వానలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. రుతుపవనాల రాకతో తెలంగాణవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ అంతటా మబ్బులు కమ్ముకున్నాయి.