వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విధులకు డుమ్మా కొట్టే ఉద్యోగుల విషయాన్ని ఇకపై ప్రభుత్వం సీరియస్ గా పరిగణించనుంది. ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులు పనితీరు అద్వానంగా ఉందన్న నివేదికల ఆధారంగా ఆ శాఖ ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే విధులకు డుమ్మాకొట్టే ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్
వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విధులకు డుమ్మా కొట్టే ఉద్యోగుల విషయాన్ని ఇకపై ప్రభుత్వం సీరియస్ గా పరిగణించనుంది. ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులు పనితీరు అద్వానంగా ఉందన్న నివేదికల ఆధారంగా ఆ శాఖ ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే విధులకు డుమ్మాకొట్టే ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఉద్యోగులు ఉదయం విధులకు రావడం ఆ తర్వాత బయటకు వెళ్లి క్లినిక్ లు, ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు బాధ్యతను పీజీ వైద్యులు, జూనియర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పైన పెట్టి వారంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి సేవలు అందిస్తుండడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు కూడా ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించింది. ఇకపై విధులకు డుమ్మా కొట్టి ఇష్టానుసారంగా వ్యవహరించే ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. విధులకు గైర్హాజరయ్యే వైద్యులు, సిబ్బందికి వెంటనే సంజాయిషీ నోటీసులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ఆదేశించారు. అవసరమైతే ఒకరోజు జీతాన్ని కోత పెట్టి ఇతర క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఉద్యోగులు సకాలంలో విధులకు రాకపోయినా, ముందుగా వెళ్ళిపోయిన ఆ ప్రభావం వైద్యశాలపై ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలకు సిద్ధమవుతోంది. అవసరమైతే ఉద్యోగులను టెర్మినేట్ చేసేందుకు కూడా వెనుకాడమన్న సంకేతాలను ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆరోగ్య శాఖలో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగులు పనితీరు అధ్వానంగా ఉండడం వల్లే ఆరోగ్య శాఖ మంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ఆయన ఆదేశించారు. తాజాగా మంత్రి విడుదల చేసిన ఆదేశాలతో ఆ శాఖలో పనితీరు మెరుగుపడుతుందా అన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల నిరుపేద రోగులకు మరింత మేలు కలుగుతుందని పేర్కొంటున్నారు. అయితే మంత్రి ఆదేశాలను ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎంత పకడ్బందీగా అమలు చేస్తారో చూడాల్సి ఉంది. గతంలోనూ ఎటువంటి ఆదేశాలు అనేకసార్లు ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలాచోట్ల వైద్యులు ప్రభుత్వ ఆదేశాలను పాటించేందుకు ఇష్టపడడం లేదు. ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలను భేకాతరు చేస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ స్వయంగా జారీ చేసిన ఆదేశాలను అమలు చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.