ఏపీలో వరదలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన పాలక, ప్రతిపక్షాలు.. రాజకీయపరమైన విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా వరద లతో విజయవాడ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. విజయవాడతోపాటు చుట్టుపక్కల అనేక ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. గడిచిన ఐదు రోజులుగా తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు అవసరమైన సహాయ చర్యలను వేగవంతం చేయాల్సిన పాలక, ప్రతిపక్షాలకు చెందిన నేతలు విమర్శలు చేసుకుంటుండడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు, జగన్
ఏపీలో వరదలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన పాలక, ప్రతిపక్షాలు.. రాజకీయపరమైన విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా వరద లతో విజయవాడ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. విజయవాడతోపాటు చుట్టుపక్కల అనేక ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. గడిచిన ఐదు రోజులుగా తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు అవసరమైన సహాయ చర్యలను వేగవంతం చేయాల్సిన పాలక, ప్రతిపక్షాలకు చెందిన నేతలు విమర్శలు చేసుకుంటుండడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాల్సిన నేతలు ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. వరదల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ రెండు రోజులు కిందట వెళ్లారు. కృష్ణలంక ప్రాంత ప్రజలను వరద నుంచి కాపాడేందుకు నిర్మించిన వాల్ వద్దకు వెళ్లిన జగన్ అక్కడి ప్రజలను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను ఆయన ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరదలపై ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందంటూ విమర్శించారు. మనుషులు స్వయంకృతం వల్ల ఏర్పడిన వరదలుగా ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా తీవ్రస్థాయిలో జగన్‌పై విమర్శలు గుప్పించారు.
విపత్తు సమయంలో ప్రజలకు సహాయం చేయకుండా విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బాబాయ్‌ను చంపిన వ్యక్తులు ఉంటే అన్నింటినీ అనుమానించాల్సి ఉంటుందని, ప్రకాశం బ్యారేజీలోకి పడవులు వెళ్లిన వ్యవహారంపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ప్రజలకు సాయం చేయడం లేదంటూ ఆరోపించారు. దీనిపై వైసీపీ కూడా అంతేస్థాయిలో కౌంటర్ ఇచ్చింది. వరదల్లో తమ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొంది. అదే సమయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించడం లేదంటూ వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించారు.దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. సహాయక కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్ధేశంతోనే వెళ్లలేదని పేర్కొన్నారు. తనను విమర్శిస్తున్న వైసీపీ నాయకులు ఇకపై ఎప్పుడైనా తనతో వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుందంటూ ఆరోపించారు. విమర్శలు మాని సహాయం చేయాలని పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులకు సూచించారు. ఇదే వ్యవహారంపై మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య వాడీవేడిగా మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ సహాయం పేరుతో ప్రచారార్భటానికి పాకులాడుతోందని వైసీపీ విమర్శిస్తుంటే.. వైసీపీ వరదలను అనవసరంగా రాజకీయం చేస్తోందంటూ టీడీపీ విమర్శిస్తోంది. ఏది ఏమైనా వరదల వ్యవహారంపై విమర్శలు చేసుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.