తెలంగాణ తల్లి కేంద్రంగా రాజకీయాన్ని ఇరు పార్టీలు రక్తికట్టిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ తల్లికి కొత్త విగ్రహ నమూనాను రూపొందించింది. దీనిని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయించింది. అయితే ఈ విగ్రహం నమూనాకు సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ రచయితల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.
పాత, కొత్త తెలంగాణ తల్లి విగ్రహాలు
తెలంగాణలో రాజకీయం సరికొత్త వేడిని రాజేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలపై బిఆర్ఎస్ పోరాడుతూ వస్తోంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. తెలంగాణ తల్లి కేంద్రంగా రాజకీయాన్ని ఇరు పార్టీలు రక్తికట్టిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ తల్లికి కొత్త విగ్రహ నమూనాను రూపొందించింది. దీనిని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయించింది. అయితే ఈ విగ్రహం నమూనాకు సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ రచయితల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ తల్లి విగ్రహంలో అభయహస్తం ముద్ర కాంగ్రెస్ ఎన్నికల గుర్తును పోలి ఉందంటూ బిజెపి కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. చేతిలో బతుకమ్మ లేకపోవడం పై అసెంబ్లీలో బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి నిలువెత్తు విగ్రహం కొలువుదీరింది. 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఆవిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. భారతీయ రాష్ట్ర సమితి ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. బిజెపి కూడా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్టుగా ప్రతిస్పందించింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని ప్రకటించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. లక్షల మంది మహిళల సమక్షంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించింది. విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం నాలుగు కోట్ల మంది బిడ్డల భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రసన్న వదనంతో, నిండైన రూపంతో చాకలి ఐలమ్మ, సారలమ్మ పోరాట స్ఫూర్తి కనిపించేలా హుందాగా, నిండుతనంతో విగ్రహాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంప్రదాయం సంస్కృతులను పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టు బొట్టుతో, గుండు పూసలు, హారం, ముక్కు పుడకతో చేతులెత్తి మొక్కేల తల్లి ఆకృతిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో తెలంగాణ తల్లి ప్రతిమకు రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం చరిత్రకు దర్పణంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు
తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్
తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బీఆర్ఎస్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక చేతిలో బతుకమ్మ, గద్వాల పోచంపల్లి నేతన్నల కృషి చూపించే పట్టుచీర, కరీంనగర్ వెండి మట్టెలు, మెట్ట పంటలకు చిహ్నంగా మక్క కంకులు ఉండేవి. కోహినూర్ వజ్రంతో కిరీటంతోపాటు వడ్డానం జరి అంచు చీర, నిండైన కేశ సంపదతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పట్లో తీర్చిదిద్దారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత విగ్రహం రూపురేఖల్లో మార్పులు చేశారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ఇందులో బతుకమ్మ కనిపించడం లేదు. దీనిపై బిఆర్ఎస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర అని బిఆర్ఎస్ వాదిస్తోంది. తెలంగాణ ఆత్మగా భావించే బతుకమ్మ లేకుండా విగ్రహాన్ని ఎలా రూపొందిస్తారని ప్రశ్నిస్తోంది. తెలంగాణ తల్లిని పేదరికంతో చూపించే ప్రయత్నం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వాదిస్తోంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేశాలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రముఖ కవి రచయిత జూలూరి గౌరీ శంకర్ పిటిషన్ వేశారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను కూడా మార్చకుండా చూడాలని ఆయన కోరారు. కెసిఆర్ పై కుట్రలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ భవన్ దగ్గర నిరసనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దిగారు. ఇది మూర్ఖపు చర్యగా అభివర్ణిస్తూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు.
ఒకపక్క ప్రభుత్వం ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుండగానే మరోవైపు మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలో తెలంగాణ తల్లి పాత విగ్రహాలను బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించింది. అయితే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టిగానే సమాధానం చెబుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ తల్లికి అసలు రూపమే లేదని, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎక్కడ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన దాఖలాలు లేవని పేర్కొంది. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అధికారికంగా లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం వాదన. బిజెపి కూడా దీనిపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టురని బిజెపి ఆరోపిస్తోంది. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటే నిండుగా ఉండేదని బిజెపి కూడా అభిప్రాయపడుతోంది. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఒక్క మహాత్మా గాంధీ పేరు తప్ప అన్ని గాంధీల పేర్లను తొలగిస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. తల్లి విషయంలో కాదు కొత్త రాష్ట్రంలో వరుసగా ఏర్పడిన రెండు ప్రభుత్వాలు రెండు భిన్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతుండడంతో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే తెలంగాణను టీఎస్ నుంచి టీజీగా మార్చడం, రాష్ట్ర గీతాన్ని గుర్తించడం, తల్లి విగ్రహాన్ని మార్చడం ఇలా ప్రతి అంశంలోనూ భిన్నమైన వాదనలను కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మధ్య వ్యక్తం అవుతుండడంతో కొన్ని రకాల ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయి.