నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 16 బిల్లులు ఆమోదానికి ఎన్డీఏ సన్నద్ధం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాల్లో 16 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇందులో వక్ఫ్ (సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ (సవరణ) సహా కీలక బిల్లులు ఉన్నాయి.

Parliament Building

పార్లమెంట్ భవనం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాల్లో 16 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇందులో వక్ఫ్ (సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ (సవరణ) సహా కీలక బిల్లులు ఉన్నాయి. ఆదివారం నిర్వహించిన ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో నిర్వహించిన సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పెట్టబోయే బిల్లులకు సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు అందించారు. మరికొన్ని బిల్లులు కూడా ప్రవేశపెట్టాలని కొందరు సభ్యులు కోరినట్లు చెబుతున్నారు. మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపుతో జోష్ లో ఉన్న ఎన్డీఏ జమిలి ఎన్నికలపైన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సమావేశాల్లోనే ఆ బిల్లు పెడతారా.? లేదా.? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అఖిలపక్ష సమావేశానికి 30 రాజకీయ పార్టీలకు చెందిన 42 మంది నేతలు హాజరయ్యారు. డిసెంబర్ 20వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న పార్లమెంటు సమావేశాలు జరగవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తాజా సమావేశాలు వేడివేడిగా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహా ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి బిజెపి ఉత్సాహంతో ఈ సమావేశాలకు సిద్ధమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా తాజాగా అదాని వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగట్టే అవకాశం కనిపిస్తోంది. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదాని లంచాలపై అమెరికాలో కేసు నమోదు చేయడం విపక్షాలకు అస్త్రంగా మారింది. అలాగే మణిపూర్ హింస, ప్రాణాంతకంగా మారిన వాయు కాలుష్యం తదితర అంశాలపై అధికార పార్టీని ఇరుకున పట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అఖిలపక్ష సమావేశంలోనూ అధాని వ్యవహారంపై చర్చ జరగాలని కోరుతున్నట్లు కాంగ్రెస్ నేత ప్రమోద్  మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్ర ఎన్నికలపైన పార్లమెంట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.

ఇదిలా ఉంటే ఈ సమావేశాల్లో బిజెపి మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దేశంలోనే మినీ ఇండియా గా పేరుగాంచిన మహారాష్ట్రలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం పార్లమెంట్ సమావేశాలు ముందు బిజెపిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల హర్యానా గెలుపు, ఇప్పుడు మహారాష్ట్ర విజయం బిజెపికి తిరుగులేని ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో బిజెపి మరింత దూకుడును ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రధాన మోడీ నేతృత్వంలో మరిన్ని కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు జమిలి ఎన్నికలపైన ఉభయ సభల్లో చర్చ జరుగుతుందని సమాచారం. కాగా వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ సంయుక్త కమిటీ ఈ నెల 29న తన నివేదిక సమర్పించే అవకాశం ఉంది. కమిటీలోని విపక్ష సభ్యులు మరికొంత సమయం కావాలని అడిగే అవకాశం ఉంది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి మంగళవారానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక వేడుకను నిర్వహించనున్నట్లు మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరగనున్న ఈ వేడుకకు రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్, ప్రధాన మోడీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ తోపాటు మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏ గ్లింప్స్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ అనే రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. కాగా, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్