భారతదేశంలో వేర్పాటువాద శక్తులకు ఊతమిస్తూ ఖలిస్థానీలకు అండగా నిలుస్తున్న కెనడా సర్కారు మరోసారి కయ్యానికి కాదు దువ్వెంది. గడిచిన ఏడాది జరిగిన ఖలిస్థాననీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొంది. వీరిని విచారించాల్సి ఉందంటూ భారత విదేశాంగ శాఖకు సమాచారాన్ని కెనడా అందించింది. దీనిపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది.
ప్రధాని మోదీ, కెనడా ప్రధాని ట్రూడో
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన యుద్ధం ప్రారంభమైందా.? అంటే అవునన్నా సమాధానమే అంతర్జాతీయ నిపుణులు నుంచి వినిపిస్తోంది. భారతదేశంలో వేర్పాటువాద శక్తులకు ఊతమిస్తూ ఖలిస్థానీలకు అండగా నిలుస్తున్న కెనడా సర్కారు మరోసారి కయ్యానికి కాదు దువ్వెంది. గడిచిన ఏడాది జరిగిన ఖలిస్థాననీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొంది. వీరిని విచారించాల్సి ఉందంటూ భారత విదేశాంగ శాఖకు సమాచారాన్ని కెనడా అందించింది. దీనిపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. భారత దౌత్యవేత్తలపై చేసిన కల్పిత ఆరోపణలకు తగిన విధంగా జవాబు చెప్పే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. కెనడా నుంచి భారత హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంది. భారత్ లో ఉన్న ఆరుగురు కెనడా దౌత్య సిబ్బందిని భారత్ నుంచి బహిష్కరించింది. 'కెనడా ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదు. తమ హైకమిషనర్, దౌత్య ఉన్నతాధికారుల భద్రత విషయంలో భరోసా లేకుండా పోయింది. తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ప్రభుత్వ చర్యలు వారి భద్రతను ప్రమాదంలోకి నెట్టాయి. అందుకే భారత హైకమిషనర్, దౌత్య ఉన్నతాధికారులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం' అని భారత్ లో కెనడా హైకమిషనర్ స్టీవార్ట్ వీలర్ కు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వీలర్ తోపాటు ఆరుగురు కెనడా దౌత్య సిబ్బందిని భారత నుంచి బహిష్కరించింది. వీరు ఈనెల 19వ తేదీలోపు భారత్ నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఇకపోతే కెనడా ప్రభుత్వం ఆరోపిస్తున్న 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ కుమార్ వర్మ 2022 సెప్టెంబర్ నుంచి కెనడాలో భారత హైకమిషనర్ గా పని చేస్తున్నారు. ఆయనపై కెనడా ఆరోపణలు చేయడాన్ని భారత్ ఖండించింది. ఆయన ఎలాంటి వారో తమకు తెలుసునని, 36 సంవత్సరాలుగా ఆయన వివిధ దేశాల్లో భారత దౌత్యవేత్తగా పని చేస్తున్నారని తెలిపింది. కెనడా ప్రధాని ట్రూడో కేవలం రాజకీయ లబ్ధి కోసం భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి వేర్పాటు వాదులకు కొమ్ముకోస్తున్నారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ పై ట్రూడో శత్రుత్వం ఇప్పటిది కాదన్న భారత్, దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ట్రుడో మంత్రివర్గంలో కొందరికి తీవ్రవాదులు, భారతదేశ విభజన కోరుకునే వారితో నేరుగా సంబంధాలు ఉన్నాయని భారత్ పేర్కొంది.
2020 డిసెంబర్లో భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఆయన నిజ స్వరూపం బయటపడిందని విదేశాంగ శాఖ నిప్పులు చెరిగింది. ఇదిలా ఉంటే కెనడా మాత్రం ఈ ఆరోపణలను కొనసాగిస్తూనే ఉంది. భారత ప్రభుత్వ ఏజెంట్లకు, కెనడా పౌరుడి హత్యకు మధ్య ఉన్న సంబంధాలపై తిరుగులేని సాక్షాలు ఉన్నాయని కెనడా దౌత్యవేత్త వీలర్ తెలిపారు. భారత్ చెబుతున్నట్లు అన్ని ఆరోపణలపైనా దృష్టి పెట్టాలన్నారు భారత్ తో సహకరించేందుకు కెనడా సిద్ధంగా ఉందని తెలిపారు. మరోవైపు క్షీణిస్తున్న భారత్, కెనడా దౌత్య సంబంధాల విషయంలో ప్రధాని మోడీ ప్రతిపక్షాల సలహాలను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ఖర్గేతోపాటు ఇతర పార్టీల నేతలపై ప్రధాని మోదీ విశ్వాసం ఉంచి వారిని సలహాలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. భారత్ కెనడా మధ్య నెలకొన్న తాజా వివాదాన్ని అంతర్జాతీయంగా పరదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అగ్రరాజ్యాలు ఎటువంటి స్పందన తెలియజేయలేదు. ఇవి ఆయా దేశాలకు సంబంధించిన అంతర్గత అంశాలుగా భావిస్తున్నందునే ఇతర దేశాలు స్పందించలేదని చెబుతున్నారు అయితే ఈ వ్యవహారం ముదిరితే మాత్రం అగ్రరాజ్యాలు స్పందించే అవకాశం ఉంది. ప్రధాన మోడీ నేతృత్వంలో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న దౌత్య విధానం నేపథ్యంలో ఈ విషయంలో భారత్ కు అగ్రరాజ్యాల నుంచి సంపూర్ణ మద్దతు లభించే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయాల విశ్లేషకులు చెబుతున్నారు.