భళా! భద్రాద్రి గిరిజన మహిళల్లారా.. మన్ కీ బాత్‌లో కొనియాడిన ప్రధాని మోదీ

ఒకప్పుడు కూలీ పని చేసుకొని బతికిన భద్రాచలం గిరిజన ఆడబిడ్డలు నేడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆదివారం ఆయన 123వ మన్ కీ బాత్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

modi

ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఈవార్తలు : ఒకప్పుడు కూలీ పని చేసుకొని బతికిన భద్రాచలం గిరిజన ఆడబిడ్డలు నేడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆదివారం ఆయన 123వ మన్ కీ బాత్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. తెలంగాణ ఆడబిడ్డల కృషిని ప్రస్తావించారు. వారి అభివృద్ధిని అభినందించారు. ‘భద్రాచలంలో గిరిజన ఆడబిడ్డలు స్వయం సహాయక బృందంగా ఏర్పడి, చిరుధాన్యాలతో బిస్కెట్లు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. శానిటరీ పాడ్స్ కూడా తయారు చేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వీరి విజయం దేశంలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకం’ అని అన్నారు. ఈ నెల 21న జరిగిన అంతర్జాతీయ యోగా విశేషాలను కూడా ప్రధాని మన్ కీ బాత్‌లో పంచుకున్నారు. ఈసారి ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో యోగా ప్రదర్శనలు జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. వాటిలో తెలంగాణలో 3000 మంది దివ్యాంగులు యోగా క్యాంప్ నిర్వహించడం ఆకట్టుకుందని తెలిపారు. పదేళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం ఏటేటా విస్తరిస్తోందని చెప్పారు. చాలామంది యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారని అన్నారు. ఈసారి యోగా దినోత్సవం థీమ్ వన్ ఎర్త్- వన్ హెల్త్ వసుధైవ కుటుంబకానికి స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడించారు.

భారత్ ట్రకోమా రహితం

భారత్‌‌ను ట్రకోమా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ అయిన ట్రకోమా రహిత దేశంగా అవతరించడంలో అందరి కృషి ఉందని కొనియాడారు. అనంతరం ఎమర్జెన్సీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ.. 50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించిన వాళ్లు రాజ్యాంగాన్ని హత్య చేసి, న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకోవాలనుకున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు. నాడు జార్జిఫెర్నాండెజ్‌ను సంకెళ్లతో బంధించారని అన్నారు. భారత ప్రజలు శక్తిమంతమైనవారు కావడంతో ఎమర్జెన్సీ తొలగిపోయిందని, ఆ పరిస్థితి విధించినవాళ్లు ఓడిపోయారని గుర్తుచేశారు. ఎమర్జెన్సీపై పోరాడిన నేతలను దేశం కచ్చితంగా గుర్తుచేసుకోవాలని అన్నారు. బోడోల్యాండ్‌.. ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు కేంద్రంగా మారిందని అభినందించారు. పరిమిత వనరులతోనే సాధన చేసి అద్భుతంగా రాణిస్తున్నారని, దేశంలోని చిన్నారులకు ఆ ఆటగాళ్లు ఆదర్శం అని శ్లాఘించారు. 

నూనె వినియోగం 10 శాతం తగ్గాలి

మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ఆరోగ్య సూత్రాలు కూడా చెప్పారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతుందని చెప్పారు. ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి‌, ఊబకాయం తగ్గించుకోవడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని సూచించారు. అదేవిధంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత శాస్త్రవేత్త శుభాంశు శుక్లాకు ప్రధాని అభినందనలు తెలిపారు. మరోవైపు, మేఘాలయ ఎరీసిల్క్‌కు జీఐ ట్యాగ్‌ లభించిందని, పురుగులను చంపకుండా వస్త్రాన్ని తయారు చేయడం దాని ప్రత్యేకత అని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో బౌద్ధ క్షేత్రాలకు విదేశాల్లో అత్యంత ప్రాధాన్యం ఉందని, అంతా తమతమ ప్రాంతాల్లోని బౌద్ధ క్షేత్రాలను సందర్శించాలని సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్