WAQF AMENDMENT BILL PASSED IN LOK SABHA : లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. బుధవారం సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి నిర్వహించిన ఓటింగ్‌లో బిల్లును ఆమోదిస్తూ మెజారిటీ సభ్యులు ఓట్ వేశారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ, ఈవార్తలు : వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం సుదీర్ఘ చర్చ అనంతరం మెజారిటీ ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా Speaker Om Birla ప్రకటించారు. 288 ఓట్లతో బిల్లు ఆమోదం పొందిందని వెల్లడించారు. ఇక బిల్లుకు వ్యతిరేకంగా 232 మంది ఓటు వేశారని వివరించారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందినట్లైంది. ఈ బిల్లును లోక్‌సభ Loksabha నుంచి రాజ్యసభకు పంపనున్నారు. రాజ్యసభలోనూ ఆమోదం పొందిందే.. బిల్లుపై సంతకానికి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రపతి సంతకం అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు.. వక్ఫ్ సవరణ చట్టంగా రూపాంతరం చెందుతుంది. దీంతో.. అప్పటి నుంచి సవరణలతో కూడిన చట్టం అమల్లోకి వస్తుంది. కాగా, బుధవారం వక్ఫ్ సవరణ బిల్లుపై వాడీవేడి చర్చ జరిగింది. బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. బిల్లు రూపకల్పన సందర్భంగా అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి రాకపోతే పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే ప్రమాదం ఉందని వెల్లడించారు.
‘బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయి. 1954లోనే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ బిల్లు తేవడానికి అనేక మందిని సంప్రదించాం. జేపీసీని నియమించాం. 284 ప్రతినిధులు, 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు జేపీసీకి తమ వాదనలు తెలియజేశాయి. ఆ మేరకు బిల్లులో కొన్ని సానుకూల మార్పులు చేశాం. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం మత విశ్వాసాలకు ఆటంకం కలిగించనే కలిగించదు. కేవలం తప్పుడు ప్రచారాన్నే కొందరు నిజం అనుకుంటున్నారు. ఇది ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేవారు, వ్యతిరేకించేవారు చరిత్రలో గుర్తుండిపోతారు. పేద ముస్లింల కోసం వక్ఫ్ ఆస్తులను ఉపయోగించాలి. ముస్లిం వర్గాల ఉన్నతి కోసం మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం ప్రతినిధులు సైతం మేం తెచ్చిన బిల్లును ఆహ్వానిస్తున్నారు. మేం తీసుకువచ్చిన సంస్కరణలతో ముస్లిం మహిళలు, పిల్లలకు హక్కులు దక్కుతాయి’ అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.