రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ, ఈవార్తలు : రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. బంగారం, వెండిపై సుంకాన్ని 6 శాతానికి కుదిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ప్లాటినంపై సుంకాన్ని 6.4 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ చార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మల చెప్పారు. ఇక, నేషనల్ పెన్షన్ స్కీంలోనూ కేంద్రం మార్పులు చేసింది. ఈ పథకంలో మైనర్లు కూడా చేరేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు, స్టాంప్ డ్యూటీ పెంచుకొనేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీని తగ్గించనున్నట్లు చెప్పారు.
క్యాన్సర్ రోగులకు ఊరట
క్యాన్సర్ రోగుల మూడు రకాల మందులపై సుంకాన్ని ఎత్తివేస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. గ్రామీణ భారతానికి రూ2.66 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులు రూ.10 లక్షల వరకు రుణం తీసుకొనే సదుపాయాన్ని కల్పిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ పెంచుతున్నట్లు వివరించారు. రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచుతున్నామని అన్నారు. కొత్త పన్నుల స్లాబుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.