వాహనదారులకు సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (LMV Driving License) ఉన్నవారు.. 7,500 కిలోల లోపు రవాణా వాహనాలు (Transport Vehicles) కూడా నడపవచ్చని స్పష్టం చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ, ఈవార్తలు : వాహనదారులకు సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (LMV Driving License) ఉన్నవారు.. 7,500 కిలోల లోపు రవాణా వాహనాలు (Transport Vehicles) కూడా నడపవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. 7,500 కిలోల లోపు బరువు ఉన్న రవాణా వాహనాలు నడిపేందుకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని.. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు కూడా ఆ వాహనాలు నడపవచ్చని వివరించారు. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు రవాణా వాహనాలను నడపడం వల్లే ప్రమాదాలకు ప్రధాన కారణం అన్న వాదనను ధర్మాసనం కొట్టివేసింది. ఆ వాదనకు ఎలాంటి స్పష్టమైన డాటా లేదని వెల్లడించింది. ‘నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ అన్నప్ప ఈరప్ప నెసారియా (National Insurance Co.Ltd vs Annappa Irappa Nesaria) కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. క్లెయిమ్‌ను వ్యతిరేకించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి టెక్నికల్ అంశాలను లేవనెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
సుప్రీం కోర్టు తీర్పులోని అంశాలివీ:
- లైసెన్స్ పరంగా.. ఎల్ఎంవీలు, ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ మొత్తంగా వేర్వేరు కాదు.
- మోటర్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 10 (2) ప్రకారం.. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు ఎలాంటి ప్రత్యేక లైసెన్స్ అవసరం లేకుండానే 7,500 కిలోలలోపు బరువు ఉన్న రవాణా వాహనాలను నడపవచ్చు.
- మోటర్ వెహికల్స్ యాక్ట్- 1988లో పేర్కొన్న అదనపు అర్హతలు.. 7,500 కేజీల కంటే ఎక్కువ బరువు (మధ్యస్థ / భారీ రవాణా, గూడ్స్ వాహనాలు) ఉండే వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.