బుల్డోజర్ చర్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బుల్డోజర్ చర్యలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితుల ఇళ్లను కూల్చివేయడం చట్టానికి వ్యతిరేకమని, ఇళ్లను కూల్చడం అంటే.. నివసించే హక్కును ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ, ఈవార్తలు : బుల్డోజర్ చర్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బుల్డోజర్ చర్యలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితుల ఇళ్లను కూల్చివేయడం చట్టానికి వ్యతిరేకమని, ఇళ్లను కూల్చడం అంటే.. నివసించే హక్కును ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం సరికాదని.. విచారణ పూర్తికాకుండానే, నిందితుడిని దోషిగా ఎలా పరిగణిస్తాం అని ప్రశ్నించింది. ఒకవేళ దోషిగా నిర్ధారించినా చట్ట ప్రకారం మాత్రమే శిక్ష విధించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. న్యాయవ్యవస్థ స్థానాన్ని పాలన వ్యవస్థ భర్తీ చేయడం సాధ్యం కాదని చురకలు అంటించింది. అధికారులు కోర్టుల పాత్ర పోషించడం సరికాదని, ఒక కార్యనిర్వాహక అధికారి ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించలేరని తెలిపింది. దోషిగా నిర్ధారించేవి కోర్టులేనని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ‘ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనేది ఒక కల. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చట్టబద్ధమైన పాలన పునాది. ఈ సమస్య నేర వ్యవస్థలో న్యాయానికి సంబంధించినది. చట్టపరమైన ప్రక్రియ నిందితుల నేరాన్ని ముందుగా నిర్ధారించకూడదు’ అని తీర్పు వెల్లడించింది.
ఈ సందర్భంగా బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.
- చట్టాన్ని, నిబంధనలను అతిక్రమించి నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చేస్తే ఆ కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిందే.
- నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఇకపై కుదరవు.
- మతానికి, కూల్చివేతలకు లింక్ పెట్టొద్దు.
- మేం ఇచ్చే ఆదేశాలు ఏ ఒక్క రాష్ట్రానికో కాదు.. యావత్తు దేశానికి సంబంధించినది.
- కేవలం క్రిమినల్ కేసులో నిందితుడు అనే కారణంతో ఇంటిని కూల్చివేయలేం.
- అధికారులు చట్టాన్ని విస్మరించరాదు. బుల్డోజర్ చర్య అంటే ప్రాథమిక హక్కులను కాలరాయడమే.