NEET Exam | నీట్ రీ ఎగ్జామ్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

NEET UG 2024 | నీట్ యూజీ-2024 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీక్ అయింది వాస్తవమేనని స్పష్టం చేసింది. ఇది 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం అని వ్యాఖ్యానించింది.

supreme court
సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, ఈవార్తలు : నీట్ యూజీ-2024 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీక్ అయింది వాస్తవమేనని స్పష్టం చేసింది. ఇది 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం అని వ్యాఖ్యానించింది. నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు, లీకేజీలు, అవకతవకలు జరిగాయని దేశవ్యాప్తంగా 38 పిటిషన్లు దాఖలు కాగా, వీటిపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచీ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. ‘నీట్ పేపర్ లీకైందన్నది వాస్తవం. ప్రశ్నపత్రాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహణకు ఆదేశిస్తాం. అయితే, దానికి ముందు ఆ ప్రశ్నపత్రం ఎంతమందికి చేరిందన్నది తెలియాల్సి ఉంది’ అని వెల్లడించారు.

లీక్ ఎలా జరిగింది.. కేంద్రానికి సుప్రీం ప్రశ్నలు

‘పేపర్ లీకేజీతో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని కేంద్రం అంటోంది. కానీ, ఈ పరీక్ష 23 లక్షల మంది విద్యార్థులు జీవితాలకు సంబంధించినది. కాబట్టి.. నీట్ పేపర్ లీక్ ఎలా జరిగిందన్నది తెలుసుకోవాలి. ఆ పేపర్ ఎంత మందికి చేరిందో గుర్తించారా? ఎలా లీకైందో తెలుసుకున్నారా? లీకేజీతో సంబంధం ఉన్న విద్యార్థులపై ఏమేం చర్యలు తీసుకున్నారు? ఎంతమంది విద్యార్థుల రిజల్ట్స్ హోల్డ్ చేశారు?’ అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వీటికి సమాధానాలు చెప్పాలని ఆదేశించింది. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరగాలని తెలిపింది. ఇవన్నీ పరిశీలించాకే తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందో తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. అసలు.. ముందుగా ప్రశ్నపత్రం ఎప్పుడు, ఎలా లీకైందన్నది తెలపాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ NTA కు ఆదేశాలు జారీ చేసింది.

నీట్ పరీక్ష టైమ్ లైన్..

- మే 5వ తేదీన నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు.

- ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు వచ్చింది.

- దీంతో పేపర్ లీక్ అయ్యిందన్న అనుమానాలు రేకెత్తాయి.

- అవకతవకలు నిజమేనని తేలడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

- గ్రేస్ మార్కులు కలపడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.

- దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

- దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలతో గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించారు.

- ఆ ఫలితాలతో నీట్ ర్యాంకులను సవరించి ఎన్టీయే జాబితాను విడుదల చేసింది.

- ఈ పరిస్థితుల నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను కూడా వాయిదా వేశారు.

- తాజాగా, సుప్రీం కోర్టు నీట్ పరీక్ష లీక్ అయ్యిందని స్పష్టం చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్