Southwest Monsoon : దేశంలోని ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు మే 31వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఎప్పుడూ లేనంత స్థాయిలో ఎండలు మండిపోయాయి. ఎప్పుడు వాన చినుకులు పలకరిస్తాయా అని ఎదురుచూస్తున్నాం. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు మే 31వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ఏడాది రుతు పవనాల రాక సాధారణ సమయానికే.. అంటే జూన్ 1 నాటికి కేరళను తాకుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. జూన్-సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.
గత ఏడాది వర్షాలు సరిగా పడకపోవడంతో దేశంలోని రైతాంగం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక తదితర రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈసారి భారీ వర్షాలు కురిస్తే రైతాంగానికి గొప్ప శుభవార్త కానుంది. అదీకాక.. భూగర్భ జల వనరులు పెరిగి, వచ్చే వేసవికి తాగు నీటి సమస్య తీరే అవకాశం ఉంది.