Prashant Kishor | లోక్‌సభ ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ సర్వే.. ఏ పార్టీ గెలుస్తుందంటే..

దేశవ్యాప్తంగా బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు. తూర్పు, దక్షిణ భారతదేశంలో బీజేపీ సీట్లలో, ఓట్ల శాతంలో గణనీయ పురోగతి సాధిస్తుందని వెల్లడించారు. ఆ ప్రాంతాల్లో మోదీ, అమిత్ షా తరచూ పర్యటించటమే అందుకు కారణం అని వివరించారు.

prashant kishor
ప్రశాంత్ కిశోర్ Photo: Twitter

ఈవార్తలు, నేషనల్ న్యూస్: లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ అధికారం చేపడుతుంది? అన్న ప్రశ్నలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు. తూర్పు, దక్షిణ భారతదేశంలో బీజేపీ సీట్లలో, ఓట్ల శాతంలో గణనీయ పురోగతి సాధిస్తుందని వెల్లడించారు. ఆ ప్రాంతాల్లో మోదీ, అమిత్ షా తరచూ పర్యటించటమే అందుకు కారణం అని వివరించారు. ఈ మేరకు ఓ ఇంగ్లిష్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు చెప్పారు. ఉత్తర, పశ్చిమ భారత్‌లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంటుందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఇండియా కూటమి 100కు పైగా సీట్లలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడిస్తే తప్ప.. బీజేపీకి ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు.

ప్రధాన పోటీ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లోనే ఉంటుందని.. కానీ మణిపూర్, మేఘాలయాలో పర్యటించడం వల్ల లాభం లేదని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీని ఉద్దేశించి ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ వంటి పార్టీలు తమకు పట్టున్న స్థానాల్లోనే బీజేపీని ఓడించలేకపోతున్నాయని వివరించారు. ఇండియా కూటమిలో ఉమ్మడి ఆమోదం పొందిన వ్యక్తి అంటూ లేరని విమర్శించారు. 

ప్రశాంత్ కిశోర్ ఇంకా ఏమన్నారంటే..

- ప్రస్తుతం దేశంలో బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉంది

- ప్రధాని మోదీని అడ్డుకోవటం ప్రతిపక్షాలకు అవకాశాలు ఉన్నా, తప్పుడు వ్యూహాలు ఆ పార్టీలను దెబ్బతీస్తున్నాయి.

- తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

- తెలంగాణలో అధిక సీట్లు గెలుచుకోనుండటం ఆ పార్టీకి పెద్ద విజయం.

- ఒడిశాలో బీజేపీ హవా ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లోనూ తొలి స్థానంలో నిలుస్తుంది.

- తమిళనాడులో రెండంకెల ఓట్ల శాతాన్ని సాధిస్తుంది

- అయితే, బీజేపీ ఆశిస్తున్నట్లు బీజేపీకి 370 సీట్లు మాత్రం వచ్చే అవకాశం లేదు.

- బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే బీజేపీ సుదీర్ఘ ఆధిపత్యం సాధిస్తుందన్నది అపోహ మాత్రమే.

- 2014 తర్వాత చాలా చోట్ల మోదీ వ్యతిరేక పవనాలు వీచాయి. అయినా ప్రతిపక్షాలు వాటిని ఆయుధాలుగా మలచుకోలేకపోయాయి.

వెబ్ స్టోరీస్