చేతిలో మొబైల్ ఫోన్.. ప్రతి ఇంట్లో ల్యాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్స్.. ఇంకేం ఇంట్లో ఎవరూ లేనప్పుడు చైల్డ్ పోర్న్ చూసేద్దామనుకుంటున్నారా? ఆగండాగండి.. ఒకవేళ ఫోన్‌లో ఆ వీడియోలు ఓపెన్ చేస్తే మీరు కటకటాల్లోకి వెళ్లిపోతారు.
ఈవార్తలు, హైదరాబాద్: చేతిలో మొబైల్ ఫోన్.. ప్రతి ఇంట్లో ల్యాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్స్.. ఇంకేం ఇంట్లో ఎవరూ లేనప్పుడు చైల్డ్ పోర్న్ చూసేద్దామనుకుంటున్నారా? ఆగండాగండి.. ఒకవేళ ఫోన్‌లో ఆ వీడియోలు ఓపెన్ చేస్తే మీరు కటకటాల్లోకి వెళ్లిపోతారు. ఏంటీ మా గ్యాడ్జెట్‌లో గుట్టుగా పోర్న్ చూస్తే పోలీసులకు తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? అనేగా మీ అనుమానం. మీరు గుట్టుగా చూసినా.. గుట్టుచప్పుడు కాకుండా గదిలో ఓ మూల కూర్చొని చూసినా.. వీడియోలు డౌన్‌లోడ్ చేసినా.. వాటిని వేరేవాళ్లకు సెండ్ చేసినా టెక్నాలజీ సాయంతో పోలీసులు ఇట్టే పట్టేసుకుంటున్నారు. అనంతరం పోక్సో కేసు నమోదు చేసి, జైలుకు పంపిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఆగస్టు వరకు 500 మంది ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువమందిపై పోర్న్ ప్రభావం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
అమెరికా నుంచి మన ఐపీ అడ్రస్‌లు పోలీసులకు..
చిన్నారులతో షూట్‌చేసిన పోర్న్ వీడియోలు చూసినా.. డౌన్‌లోడ్ చేసినా.. వారిని ఎవరికైనా పంపినా శిక్షార్హులేనని ఇటీవల సుప్రీంకోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. చైల్డ్ పోర్న్ వీడియోలను వాట్సాప్ గ్రూప్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టా ద్వారా షేర్‌చేస్తన్నవారిపై నిఘా పెట్టారు. ఇక్కడి పోలీసులతోపాటు విదేశాల్లోని నిఘా సంస్థలు కూడా వీటిపై దృష్టిపెట్టాయి. అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ ఎస్ ఐ), నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్స్ (ఎన్‌సీఎంఈసీ) లాంటి సంస్థలు ఇండియాలో పోర్స్ చూసేవారి గ్యాడ్జెట్స్ ఐపీ అడ్రస్‌లను సేకరించి, కేంద్ర హోంశాఖకు అందజేస్తున్నాయి. అలా వచ్చిన ఇన్ఫర్మేషన్‌తో ఇటీవల ఓ యువకుడిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఇక్కడి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గుట్టుగా చైల్డ్ పోర్న్ వీక్షించే వారిని ఐపీ అడ్రస్‌ల ఆధారంగా గుర్తిస్తున్నారు. వారిపై పోక్సో కింద కేసు నమోదు చేస్తున్నారు. చైల్డ్ పోర్న్ చూసినా.. షేర్ చేసినా పోక్సోతోపాటు ఐటీ చట్టం కింద కేసులు పెడుతున్నారు. ఈ కేసుల్లో ఐదేండ్ల జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.