Operation Sindoor | పాకిస్థాన్, పీవోకే టెర్రరిస్టు స్థావరాలపై భారత ఆర్మీ దాడులు.. 30 మంది ఉగ్రవాదులు హతం..!

నిద్రలేచేసరికి భారత ఆర్మీ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్ధరాత్రి 1.44 నిమిషాల ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై తన పంజా విసిరింది. పాకిస్థాన్, పీవోకేలో బాంబుల మోత మోగించింది.

operation sindoor
ఆపరేషన్ సింధూర్

న్యూఢిల్లీ: నిద్రలేచేసరికి భారత ఆర్మీ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్ధరాత్రి 1.44 నిమిషాల ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై తన పంజా విసిరింది. పాకిస్థాన్, పీవోకేలో బాంబుల మోత మోగించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట నిర్వహించిన అటాక్‌లో ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. మొత్తంగా 9 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పీవోకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. మిస్సైల్ అటాక్స్‌తో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. మాక్ డ్రిల్ అంటూనే పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేయడం గమనార్హం.

దాడి చేసిందిలా..

పాక్ ఉగ్రస్థావరాలపై అత్యంత కచ్చితత్వంలో భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్ సిస్టమ్, లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్‌ను ఉపయోగించి దాడులు నిర్వహించింది. అటాక్ చేయాల్సిన ప్రాంతాల కో ఆర్డినేట్స్‌ను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించాయి. అయితే, భారత భూభాగం నుంచే వైమానిక దాడులు నిర్వహించడం గమనార్హం. ఈ దాడిలో 4 జైషే మహ్మద్, 3 లష్కరే తాయిబా, 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, దాడి గురించి భారత ఆర్మీ ముందే హింట్ ఇచ్చింది. దాడికి కొన్ని నిమిషాల ముందు.. రెడీ టు స్ట్రైక్.. ట్రైన్డ్ టు విన్ అని క్యాప్షన్‌తో ట్వీట్ చేసింది. ఆ తర్వాత పది నిమిషాలకే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.

భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే..

భారత ఆర్మీ పాక్‌లోని 4, పీవోకేలోని 5 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఆ ప్రాంతాల్లో మురిడ్కే, ముజఫరాబాద్‌లోని 2 ప్రాంతాలు, కోట్లీ, గుల్పూర్, భీంబర్, సియాల్‌కోట్, చకంబ్రూ ప్రాంతాలపై మెరుపు దాడులు చేసింది. ఇందులో మురిడ్కే.. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కంచుకోట. 

పాకిస్థాన్ అలర్ట్

భారత ఆర్మీ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ అలర్ట్ అయ్యింది. లాహోర్, సియాల్ కోట్ ఎయిర్‌పోర్టులను 48 గంటల పాటు మూసివేసింది. ముజఫరాబాద్‌లో కారు చీకట్లు అలుముకున్నాయి. భారత్ మెరుపు దాడితో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉలిక్కిపడ్డారు. భారత్ తమ దేశంలోని 5 ప్రాంతాల్లో దాడులకు తెగబడిందని ఆరోపించారు. భారత్ చేపట్టిన ఈ యుద్ధ చర్యలకు గట్టిగా బదులిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. భారత దాడులతో ఆ దేశంలోని రావల్పిండి, ఇస్లామాబాద్, బహ్వాల్పూర్‌లో పాక్ ప్రభుత్వం మెడికల్ ఎమర్జెన్సీ విధించింది. 

భారత్ కూడా..

సరిహద్దుల్లో పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. ఎల్వోసీ వద్ద భారత్ వైపు కాల్పులు మొదలు పెట్టారు. యుద్ధ ట్యాంకులను మోహరిస్తున్నారు. దీంతో భారత సైన్యం కూడా సరిహద్దుల్లో వైమానిక రక్షణ విభాగాలను సన్నద్ధం చేసింది. మన గగనతలంలోకి శత్రు దేశ క్షిపణులు వస్తే వెంటనే కూల్చేయాలని రెడీ అయ్యింది. మరోవైపు.. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎయిర్‌పోర్టును మూసివేసింది. అమృత్ సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల ఎయిర్‌పోర్టులను కూడా మూసేసింది. ఇక, దాడులపై పలు దేశాలకు భారత్ వివరించింది. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా తదితర దేశాలకు సమాచారం ఇచ్చింది. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగానే ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఈ దాడులు చేశామని స్పష్టం చేసింది. పాక్ ప్రజలకు ఎలాంటి హాని జరగలేదని తేల్చి చెప్పింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్