రోగనిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకొనేందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్తున్నారా? అయితే, అంతకుముందు యాంటీ బయాటిక్స్ వాడకపోవటం ఉత్తమం అంటోంది నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ).
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ, ఈవార్తలు : రోగనిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకొనేందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్తున్నారా? అయితే, అంతకుముందు యాంటీ బయాటిక్స్ వాడకపోవటం ఉత్తమం అంటోంది నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ). ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లోని ఫ్యాకల్టీలు, సీనియర్ అధ్యాపకులకు తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. అదేవిధంగా యాంటీబయాటిక్ నిరోధకత పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో వైద్యులకు కీలక సూచనలు చేసింది. వ్యాధి తీవ్రతను బట్టి మాత్రమే యాంటీబయాటిక్స్‌ను సిఫార్సు చేయాలని సూచించింది. దీనిపై ‘నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటిమైక్రోబయాల్ రెసిస్టెన్స్’ పేరుతో జూన్ 14న 156 పేజీలతో మార్గదర్శకాలను పంపించింది. అందులో.. రోగులు వైద్య పరీక్షలు చేయించుకొనే ముందు యాంటీ బయాటిక్స్ వాడకుండా చూడాలని సూచించింది. యాంటీబయాటిక్స్ వాడకుండా ఉంటే అసలైన వ్యాధికి అసలైన పరీక్ష చేసేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. దానివల్ల రోగానికి కారణమయ్యే అసలు సూక్ష్మజీవిని గుర్తించవచ్చని వివరించింది. వీలైనంత వరకు యాంటీ బయాటిక్స్ తీసుకొనేకంటే ముందే రక్త, మూత్ర నమూనాలు సేకరించాలని తెలిపింది. అత్యవసర సమయాల్లో వైద్యుడు రోగాన్ని గుర్తించలేని సందర్భంలో మాత్రమే రక్త పరీక్షలకు ముందు యాంటీ బయాటిక్స్ వాడకాన్ని సిఫార్సు చేసింది. వైద్యులందరికీ యాంటీ బయాటిక్స్ వాడకంపై కచ్చితమైన ప్రమాణాలు తెలియజేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆదేశించిన నేపథ్యంలో ఎన్‌ఎంసీ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.
యాంటీ బయాటిక్స్ ఎలా సిఫార్సు చేయాలంటే..
బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్ల ద్వారా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఇందులో కచ్చితమైన దాన్ని గుర్తించాలంటే యాంటీ బయాటిక్స్ వాడకపోవటం మేలు. అందుకే మార్గదర్శకాల్లో.. వైద్య పరీక్షలకు ముందు యాంటీ బయాటిక్స్ వద్దని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఇన్ఫెక్షన్‌కు గురిచేసే సూక్ష్మజీవిని గుర్తించి.. దాని కట్టడికి యాంటీ బయాటిక్స్ ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఇచ్చే డోసు కూడా తక్కువగా, వ్యాధి తీవ్రతను బట్టి పెంచుతూ పోవాలని, రోగి వయసు, బరువు, కిడ్నీ పనితీరు, ఇన్ఫెక్షన్ అయిన అవయవాన్ని బట్టి డోస్ తీవ్రత ఉండాలని వివరించింది. వైద్యుడికి అనుభవరీత్యా వైద్య పరీక్షలు అవసరం లేకుండా రోగ తీవ్రత తెలిసి.. యాంటీ బయాటిక్స్ ఇవ్వాలని అనిపిస్తే ప్రతి రోజు రోగి పరిస్థితిని సమీక్షించాలని పేర్కొంది.
ఎన్‌ఎంసీ ఎందుకు ఈ మార్గదర్శకాలను విడుదల చేసిందంటే..
ఈ మధ్య కాలంలో ప్రజలు యాంటీ బయాటిక్స్‌ను మితిమీరి వాడుతున్నారు. వైద్యులు కూడా ప్రతి చిన్న రోగానికి యాంటీ బయాటిక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. దీంతో వైరస్‌లు యాంటీ బయాటిక్స్‌ను తట్టుకొని నిలబడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి వైరస్ మొండిగా మారి.. రోగాలు విచ్చలవిడిగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అది మరణాలకు కూడా దారితీసే ప్రమాదం పొంచి ఉంది. అందుకే యాంటీ బయాటిక్స్ వాడకంపై కచ్చితమైన మార్గదర్శకాలను ఎన్‌ఎంసీ విడుదల చేసింది.