Nyaya Sanhita | భారతీయ న్యాయ సంహిత చట్టం జూలై 1 (నేటి నుంచి) నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో దీన్ని తీసుకువస్తుండగా, పార్లమెంట్‌లో ఈ చట్టంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ, ఈవార్తలు : భారతీయ న్యాయ సంహిత ( Bharatiya Nyaya Sanhita ) చట్టం జూలై 1 (నేటి నుంచి) నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో దీన్ని తీసుకువస్తుండగా, పార్లమెంట్‌లో ఈ చట్టంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. కొత్త చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుందని వెల్లడించారు. కొత్త న్యాయ చట్టాలపై విపక్ష నేతల అనవసర ఆరోపణలు చేస్తున్నారని, కానీ బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ చట్టంపై లోక్‌సభలో 9.30 గంటల పాటు, రాజ్యసభలో సుమారు 6 గంటల పాటు చర్చించామని.. ఈ న్యాయ చట్టాలను బాధితులే కేంద్రంగా తయారయ్యాయని వివరించారు. కొత్త న్యాయ చట్టాలతో నేర విచారణ వేగంగా, నిర్దిష్ట సమయంలో పూర్తవుతుందని చెప్పారు. కొత్త చట్టాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, భారతీయ న్యాయ సంహితపై అభిప్రాయాలను చెప్పాలని ఎంపీలకు లేఖ కూడా రాశానని అమిత్ షా తెలిపారు.
ఇక, హిందూ భావన తెచ్చారని కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంట్‌లో విపక్ష నేత రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్ అయ్యారు. హింస భావనను ధర్మంతో జోడించారని మండిపడ్డారు. క్షమాపణలు చెప్పాకే రాహుల్ ప్రసంగం కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా.. రాష్ట్రపతి ప్రసంగానికి దశ, దిశ లేదని వ్యాఖ్యానించారు. ఇక, ప్రధాని మోదీ నినాదాలు ఇవ్వడంలో నిపుణులు అని కామెంట్ చేశారు. మణిపూర్ తగలబడిపోతుంటే ప్రధాని అక్కడ పర్యటించలేదని అన్నారు. దీంతో ఖర్గే ప్రసంగంపై అధికార పక్షాలు అభ్యంతరం తెలిపాయి.