ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అత్యంత దుర్మార్గమైన రీతిలో విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లోని 13 పార్లమెంటు స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బహిరంగ లేఖ రాశారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్
ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అత్యంత దుర్మార్గమైన రీతిలో విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లోని 13 పార్లమెంటు స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధాన మోదీ తీరు పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్. ప్రధాని మోదీ పూర్తి విభజన మనస్తత్వం కలిగిన వ్యక్తి అని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. ప్రధాని పదవిని గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోతారని ఆరోపించారు. గతంలో ఏ ప్రధాని కూడా మోదీ మాదిరిగా దుందుడుకుతనంతో ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలను , ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని వ్యాఖ్యానించారు. తనపైనా మోదీ కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారని, అయితే తన జీవితంలో ఎప్పుడూ ఒక సామాజిక వర్గాన్ని వేరు చేసి చూడలేదని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. ఈ తరహా విధానాలు బిజెపికి మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. గడిచిన పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించని సంక్షోభాన్ని చవిచూసిందని, పెద్ద నోట్ల రద్దు విపత్తు, లోప భూయిష్టమైన జీఎస్టీ, కోవిడ్ 19 సమయంలో నిర్వహణ లోపాలతో దేశం దయనీయ పరిస్థితుల్లోకి జారిపోయిందని మాజీ ప్రధాన మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన పదేళ్లలో బిజెపి ప్రభుత్వం పంజాబీలను అణచివేచిందని, ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమించిన రైతుల్లో పంజాబ్ కు చెందిన 750 మంది అమరులయ్యారన్నారు. మన రైతులను ఆందోళన జీవులు, పరాన జీవులు అంటూ పార్లమెంటులో ప్రధాని ఎద్దేవా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో ఆయన విధానాలతో రైతులు ఆదాయానికి గండిపడిందని, ఒక్కో రైతుపై రుణభారం సగటున రూ.27 వేలు వరకు పెరిగిందన్నారు. ఇంధనం, ఎరువుల రేట్లు పెంచడం, 35 వ్యవసాయ సంబంధిత పరికరాలపై జిఎస్టి విధించడం వంటి నిర్ణయాలు రైతుల కుటుంబాల ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. తాజాగా మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల పట్ల బిజెపి నేతలు కూడా తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.