ఒకటి కాదు.. రెండు కాదు.. 144 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళాకు సర్వం సిద్ధం అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది.
మహా కుంభమేళా
ఒకటి కాదు.. రెండు కాదు.. 144 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళాకు సర్వం సిద్ధం అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ మహా కుంభమేళా ముగియనుండగా.. మొత్తం 45 రోజుల పాటు జరుగనుంది. అసలు కుంభమేళా అంటే ఏంటి? అర్ధ కుంభమేళా.. కుంభమేళా.. మహా కుంభమేళా.. అంటే ఏంటి? ఏ ప్రాతిపదికన వీటిని నిర్వహిస్తున్నారు. అంటే.. హిందూ పురాణాల్లోకి వెళ్లాల్సిందే.
ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాను మహాకుంభమేళాగా పిలుస్తున్నాం. ఇది 144 ఏళ్లకోసారి వస్తుంది. 6 ఏళ్లకు ఓసారి నిర్వహించేది అర్ధ కుంభమేళా. 12 ఏళ్లకు ఓసారి నిర్వహించేది కుంభమేళా. 144 ఏళ్లకు ఓసారి నిర్వహించేదే.. మహా కుంభమేళా. మన దేశంలో కుంభమేళాలను 4 ప్రాంతాల్లోనే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్,ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని గంగానది, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ శిప్రానది, మహారాష్ట్రలోని నాసిక్ గోదావరి నదిలో కుంభమేళాలు నిర్వహిస్తారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను మాత్రం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభమేళా ప్రారంభం అవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపై ఒక ఏడాది.. దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం.. దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన భీకర యుద్ధంలో.. ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. ఆ పడిన ప్రాంతాలో ప్రయాగ్‌రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి.. ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపై 144 ఏళ్లకు సమానం. అందుకే 144 ఏళ్లకు ఒకసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారు. మహా కుంభమేళాను ప్రయాగ్‌రాజ్‌లోనే ఎందుకు నిర్వహిస్తారంటే.. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం ఇక్కడే కాబట్టి. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్య స్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. ఈ మహా కుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెప్తుంటారు. ఈ మహా కుంభమేళాను ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈసారి జరిగే మహాకుంభమేళాకు దాదాపు 45 కోట్ల మంది హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2100 కోట్ల స్పెషల్ గ్రాంట్‌ను మంజూరు చేసింది.
రాచస్నానాలకు ప్రాధాన్యం
మహా కుంభమేళా సమయంలో భక్తులు ఆచరించే రాచ స్నానాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఏడాది జరిగే మహా కుంభమేళాలో రాచస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. జనవరి 13వ తేదీన పుష్య పౌర్ణమి రోజున మొదటి రాచ స్నానం, జనవరి 14న మకర సంక్రాంతి రోజున రెండో రాచ స్నానం, జనవరి 29వ తేదీ మౌని అమవాస్య రోజున మూడో రాచ స్నానం, ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి రోజున నాలుగో రాచ స్నానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 12వ తేదీ మాఘ పూర్ణిమ రోజున ఐదో రాచ స్నానం ఆచరిస్తారు. మహా కుంభమేళా ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పర్వదినాన.. ఆరో రాచ స్నానం చేస్తారు.
కుంభమేళాలు తేదీల నిర్ణయం ఇలా..
ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి. ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి.. సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్‌లో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో, గురుడు వృషభరాశిలో.. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు.. ప్రయాగ్‌రాజ్‌లో, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళాలు నిర్వహిస్తారు.
మహాకుంభమేళాలో కార్యక్రమాలు:
పవిత్ర స్నానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు, ఆచారాలు, అగ్ని వేడుకలు, సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతి, భక్తి గీతాల ఆలాపన, సంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాల ప్రదర్శన, స్థానిక హస్తకళల ప్రదర్శన, వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. భక్తి గీతాలు, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో కుంభమేళా జరిగే ప్రాంతం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది. ఈసారి ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ కుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో 3 లక్షల మొక్కలు నాటారు. మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు కోసం అనేక ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది డాక్టర్లు, వైద్య నిపుణులు, 90 మంది ఆయుర్వేద, యునానీ నిపుణులు, 200 మంది నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద 35 శాశ్వత ఘాట్‌లతో పాటు కొత్తగా 8 ఘాట్‌లను నిర్మించారు. మహా కుంభమేళాలో తొలిసారి భక్తుల కోసం 11 భాషల్లో ఏఐ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇక.. మహా కుంభమేళాకు లక్షల సంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరు కానున్నారు. ఇప్పటికే 20 వేలకు పైగా సన్యాసులు, సంస్థలకు స్థలాలను కేటాయించారు. 13 అఖాడాలు, దండివాడ, ఆచార్య వాడతో పాటు ప్రయాగవాల్ సభ, ఖాక్ చౌక్‌లకు స్థలాలను యూపీ సర్కార్ అందజేసింది.
భక్తుల కోసం డోమ్ సిటీ
మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి డోమ్ సిటీని ఏర్పాటు చేసింది. అరైల్ ప్రాంతంలో 3.25 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ డోమ్ సిటీని రూ.51 కోట్లతో నిర్మించింది. ఈ డోమ్ కాటేజీలో 360 డిగ్రీల్లో అన్ని వైపుల నుంచి చూసేందుకు వీలుంటుంది. 32 అడుగుల పరిమాణంతో 44 డోమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్, ఫైర్ ఫ్రూప్‌గా ఉండేలా వీటిని పాలికార్బొనేట్ షీట్లతో నిర్మించారు. 15 నుంచి 18 అడుగుల ఎత్తులో ఉన్న ఈ డోమ్స్.. భక్తులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు రక్షణగానూ ఉంటాయి. ఈ డోమ్ సిటీలో అన్ని లగ్జరీ సౌకర్యాలతో 176 కాటేజీలను కూడా నిర్మించారు. ఇక.. మహా కుంభమేళాలో 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు. 11 వేల త్రిశూలాలను ఉపయోగించారు. ప్రతి జ్యోతిర్లింగం 9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
కుంభమేళా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1225 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడిరచింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి ఒక రైలు.. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ ఈ రైలు నడుస్తోంది. ఇది ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణ సమయం దాదాపు 25 గంటలు. అయితే, జనవరి 8 నుంచి స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 8 నుంచి సికింద్రాబాద్, మౌలాలి, తిరుపతి, మచిలీపట్నం, నరసాపూర్ నుంచి రైళ్లు నడపనుంది. ఇక.. ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ రైళ్లను కుంభ్‌మేళా స్పెషల్ యాత్ర పేరుతో జనవరి 19, ఫిబ్రవరి 14 నుంచి రెండు ప్రత్యేక రైళ్లను వేరుగా నడుపుతోంది. ఐఆర్‌సీటీసీ రైళ్లలో 7 రోజుల ప్యాకేజీ ఉంటుంది. ప్రయాగ్‌రాజ్‌తో పాటు వారణాసి, అయోధ్య యాత్ర ఉంటుంది. ప్రయాగ్‌రాజ్‌లో ఉండడానికి టెంట్ సౌకర్యం కల్పిస్తారు. విజయవాడ నుంచి ఆది, మంగళవారాల్లో ఒక రైలు అందుబాటులో ఉంది. విశాఖపట్నం నుంచి స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు నేరుగా విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. ఇండిగో సంస్థ ఉదయం 10.50 గంటలకు ఒక విమానం నడుపుతోంది. విజయవాడ, విశాఖపట్నం నుంచి కనెక్టింగ్ విమానాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా ప్రయాగ్‌రాజ్ విమాన ప్రయాణానికి ఒక గంట 40 నిమిషాలు పడుతుంది.
చూడదగ్గ ప్రదేశాలు:
ప్రయాగ్‌రాజ్‌లో హనుమాన్ ఆలయం, అలోప్ మందిరం, అలహాబాద్ కోట, ఆనంద్ భవన్, చంద్రశేఖర్ అజాద్ పార్కు వంటివి చూడొచ్చు. ప్రయాగ్‌రాజ్ నుంచి అయోధ్య 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. 130 కిలోమీటర్ల దూరంలో వారణాసి, చిత్రకూట్ ఉన్నాయి. వీటిని కూడా దర్శించుకోవటానికి అవకాశం ఉంది.