మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన ప్రదేశాలు ఉండే చోట్లలో మద్యం అమ్మకాలను బంద్ చేయాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్ : పుణ్యక్షేత్రాలు ఉన్న చోట మద్యం దుకాణాలు ఉండటంపై చాలా మంది అసహనం వ్యక్తం చేస్తుంటారు. దేవుడి దగ్గర ప్రశాంతంగా దర్శనం చేసుకొందామని వస్తే ఇదేంటి? అని అంటుంటారు. ఇలాంటి పరిస్థితిని గమనించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన ప్రదేశాలు ఉండే చోట్లలో మద్యం అమ్మకాలను బంద్ చేయాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మద్య నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం మహేశ్వర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం అయ్యాక కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ మీడియాకు వెల్లడించారు.
మద్య నిషేధం ఎక్కడెక్కడ అమలు చేస్తారంటే..
ఉజ్జయిని, ఓంకారేశ్వర్, బాందక్పూర్, మైహర్, సల్కాన్‌పూర్, లింగ, దితియా, మండలేశ్వర్, మహేశ్వర్, మాండసౌర్, అమర్‌కంటక్, మాండ్లా (నర్మదా ఘాట్), ముల్తాయ్, కుండల్‌పూర్, చిత్రకూట్, బర్మన్, పన్నాలో లిక్కర్‌ను బ్యాన్ చేస్తారు. (ఇందులో ఉజ్జయిని, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలు. మైహర్ ప్రముఖ శక్తిపీఠం. నర్మదా నది పుట్టుక ప్రాంతం అమర్‌కంటక్. మధ్యప్రదేశ్‌లో కృష్ణ భగవానుడు, శ్రీరాముడు ఎక్కడెక్కడ అడుగుపెట్టారో అక్కడ ఈ మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యపానాన్ని అమలు చేస్తామని.. ముందుగా 17 పట్టణాల్లో మద్యం దుకాణాలను శాశ్వతంగా మూసేస్తామని సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు)