July Rains : భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. జూన్‌లో వర్షాలు పడకున్నా, జూలైలో మాత్రం సగటు కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ, ఈవార్తలు : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలొచ్చినా.. అనుకున్న సమయం కంటే ముందే ఆవరించినా జూన్‌లో వానలు మాత్రం పడలేదు. ఫలితం.. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత దారుణంగా 11 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. పైగా, 1901 తర్వాత అత్యంత వేడిమి నమోదైన నెలగా జూన్ నిలిచింది. దాని ఎఫెక్ట్‌తో వర్షాలు పడక నాట్లు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడాలని వరుణ దేవుడికి మొక్కుతున్నారు. వేయి కళ్లతో, కోటి ఆశలతో ఆకాశం వైపు చూస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న ఈ సమయంలో భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. జూన్‌లో వర్షాలు పడకున్నా, జూలైలో మాత్రం సగటు కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సగటు కన్నా అధిక వర్షపాతం నమోదయ్యేందుకు 80 శాతం చాన్స్ ఉన్నదని వెల్లడించింది.
మరోవైపు, ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ‘లానినా కండీషన్స్ మాన్‌సూన్ వానలకు అనుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆగస్టు, సెప్టెంబర్ వరకు కొనసాగవచ్చు’ అని స్పష్టం చేసింది. భారత వాతావరణ కేంద్రం ప్రకటనతో రైతులకు భారీ ఉపశమనం కలగనుంది.
వాస్తవానికి జూన్‌లో మొత్తంగా 87 సెంటీమీటర్ల వర్షం పడాలి. కానీ, అందులో 15 శాతమే వానలు పడ్డాయి. మే 30నే కేరళను నైరుతి రుతుపవనాలు తాకినా, మహారాష్ట్రలో నిలిచిపోయాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో వేడి గాలులు వీయటంతో నైరుతి కదలిక మందకొడిగా మారింది. దాంతో దేశవ్యాప్తంగా 16 రోజుల పాటు తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ 11 నుంచి జూన్ 27 వరకు వానలే పడలేదు. అయితే, జూలైలో మాత్రం పరిస్థితులు అనుకూలంగా మారతాయని వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు ఆవరించి ఉండటమే అందుకు కారణం అని పేర్కొంది.