ఎన్డీయే ఎంపీలంతా కలిసి ఎన్డీయే పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi )ని ఎన్నుకోవటంతో ఆయన ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూన్ 7: ఎన్డీయే ఎంపీలంతా కలిసి ఎన్డీయే పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi )ని ఎన్నుకోవటంతో ఆయన ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్డీయే ( NDA ) పక్షనేతలంతా ఏకాభిప్రాయంతో మోదీని ఎన్నుకొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్డీయే మద్దతుదారుల లేఖతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ (President Droupadi Murmu )ను కలిసి అందజేశారు. పూల బొకే అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. దీంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీని రాష్ట్రపతి ఆహ్వానించారు. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. ( Narendra Modi to take oath as PM on June 9 )
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో పాటు, కేబినెట్ మంత్రివర్గ లిస్ట్ అందజేయాలని రాష్ట్రపతి సూచించారు. దీంతో ప్రధానితో పాటు ప్రమాణం చేసే కీలక మంత్రుల జాబితాను రూపొందించేందుకు ఎన్డీయే పక్ష నేతలు జేపీ నడ్డా నివాసంలో సమావేశమయ్యారు. అక్కడ మంత్రి వర్గ కూర్పుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో అమిత్ షా, ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు. కేబినెట్‌లో ఉండే మంత్రుల జాబితాను రాష్ట్రపతికి వీలైనంత త్వరగా అందజేస్తామని, ప్రమాణ ఏర్పాట్లను రాష్ట్రపతి భవన్ చూసుకుంటుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇక, ఆదివారం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో, ఈ నెల 12న చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు.