ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటీ అంటే.. వక్ఫ్ సవరణ బిల్లు-2024. ఈ బిల్లు వద్దని ప్రతిపక్షాలు.. తెచ్చే తీరుతామని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు స్పష్టం చేస్తోంది. తమిళనాడులోని ఒక గ్రామం మొత్తం తమదేనంటూ వక్ఫ్ బోర్డు ప్రకటించడంతో వక్ఫ్ బోర్డు రద్దుకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది.
ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటీ అంటే.. వక్ఫ్ సవరణ బిల్లు-2024. ఈ బిల్లు వద్దని ప్రతిపక్షాలు.. తెచ్చే తీరుతామని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు స్పష్టం చేస్తోంది. తమిళనాడులోని ఒక గ్రామం మొత్తం తమదేనంటూ వక్ఫ్ బోర్డు ప్రకటించడంతో వక్ఫ్ బోర్డు రద్దుకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది. అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ చట్టం ఏం చెప్తోంది? సవరణలు ఎందుకు? వక్ఫ్ బోర్డుపై వివాదం ఏంటి? ప్రభుత్వ నిర్ణయాలు ఏంటి? ప్రతిపక్షాల రాద్ధాంతం ఏంటి? వక్ఫ్ అనే అంశం ఎలా వచ్చింది? వక్ఫ్ ఆస్తులను తిరిగి తీసుకోవచ్చా? అన్ని ఇస్లామిక్ దేశాలు వక్ఫ్ చట్టాన్ని కలిగి ఉన్నాయా? ప్రస్తుతం వక్ఫ్ బోర్డు పరిధిలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలివిగో..
వక్ఫ్ చట్టం ఏం చెప్తోందంటే..
1954లో వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు. అనంతరం 1995లో తొలిసారి సవరణలు చేశారు. ఆ సందర్భంగా వక్ఫ్ బోర్డుకు అనేక అధికారాలను కట్టబెట్టారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని సవరణలు చేసి ఆ బోర్డుకు విశేష అధికారాలు కట్టబెట్టింది. అందులో ముఖ్యమైనది.. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుూ సవాల్ చేయలేదు. ఉదాహరణకు ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకొనేలా ప్రత్యేక అధికారులు కల్పించారు. ఇలా.. దేశవ్యాప్తంగా మొత్తం 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఆ చట్టంతోనే తమిళనాడు గ్రామాన్ని వక్ఫ్ బోర్డు తనదిగా ప్రకటించింది. ఈ అనియంత్రిత వ్యవస్థను నియంత్రించే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ ఏడాది ఆగస్టు 8న రెండు బిలులు.. వక్ఫ్ (సవరణ) బిల్లు-2024, ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు-2024ను ప్రవేశపెట్టింది.
వక్ఫ్ (సవరణ) బిల్లు-2024..
వక్ఫ్ చట్టం-1995కు సవరణలు చేసిందే వక్ఫ్ (సవరణ) బిల్లు-2024. వక్ఫ్ ఆస్తులపై పాత చట్టంలో ఉన్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించే దిశగా ఈ బిల్లును తీసుకొచ్చారు. దేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్ వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశమే కొత్త బిల్లు. ఈ బిల్లును జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్‌కు పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్ మేరకు జేపీసీకి పంపారు.
ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు-2024..
ముసల్మాన్ వక్ఫ్ చట్టం-1923ను రద్దు చేయడమే ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు-2024 ముఖ్య ఉద్దేశం. పాత చట్టంతో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ ప్రస్తుత కాలంలో సాధ్యం కానందున.. దీన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబూదారీతనం, ఏకరూపతను సాధించే దిశగా బిల్లును తీసుకొచ్చింది.
వక్ఫ్ అంటే..
వక్ఫ్ అంటే.. నిర్బంధం, నిషేధం, ఒక వస్తువును నిశ్చలంగా ఉంచటం అని అర్థం. ఇస్లామిక్ చట్టం ప్రకారం.. అల్లాకు అంకితమైనది. దానం చేసే వ్యక్తిని వకీఫ్ (దాత) అని అంటారు. ఆ ఆస్తిని ఆ వ్యక్తి తిరిగి పొందలేరు. వక్ఫ్ అనేది అరబ్బీ పదం. ఇస్లామిక్ చట్టం పరిధిలోని మత సంబంధిత ఆస్తులకు ప్రత్యేకంగా పెట్టిన పేరే వక్ఫ్. దీని ప్రకారం బోర్డు పరిధిలోని భూమిని వాడుకోవడానికి, అమ్మడానికి వీల్లేదు. ఈ ఆస్తి నిర్వహణ బాధ్యతలు ముతవల్లీ (ట్రస్టీ) చూస్తాడు. ఈ పదం తొలిసారి ఢిల్లీ సుల్తానుల కాలంలో వాడుకలోని వచ్చింది. సుల్తాన్ మైజుద్దీన్ శామ్ ఘావోర్.. జామా మసీదుకు రెండు గ్రామాలను దానం చేశాడు. వాటి నిర్వహణ బాధ్యతలను షైకుల్ ఇస్లామ్‌కు బదిలీ చేశాడు. అలా ఒక్కొక్కరు.. దానం చేసుకుంటూ వెళ్లటంతో దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులు పెరిగిపోయాయి.
వక్ఫ్ బోర్డుపై తీవ్ర వ్యతిరేకత
- తొలిసారి 19వ శతాబ్దంలోనే వక్ఫ్ భూములపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. బ్రిటిష్ పాలనలో వక్ఫ్ అన్నదాన్నే తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో వక్ఫ్ అనేది ఆమోద్యయోగమైనది కాదు అని నలుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది. కానీ ఆ నిర్ణయం అమలు కాలేదు. 1913లో వచ్చిన ముసల్మాన్ వక్ఫ్ వాలిడేటింగ్ యాక్ట్.. భారత్‌లో వక్ఫ్‌కు అధికారాలు పెరిగిపోయాయి. ఇదే వ్యతిరేకత తర్వాత కూడా కొనసాగింది.
- ప్రస్తుతం దేశంలో ముస్లింలతో పాటు జైనులు, సిక్కులు సహా పలు వర్గాలు మైనారిటీలుగా ఉన్నారు. ఇతర మతాల వారికి లేని ఇలాంటి చట్టం వక్ఫ్ బోర్డు ద్వారా ఒక్క ముస్లింలకే ఉంది. దీన్నే హిందువులు సహా ఇతర మైనారిటీ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.
- మత ప్రాతిపదికన ట్రైబ్యునల్ ఉండటం ఏంటి? ఒక దేశం.. రెండు చట్టాలా? ఒక దేశం ఒకే ఆస్తి ఉండాలి అనేది మరో వాదన.
- ఒకసారి వక్ఫ్ భూమి అని ప్రకటిస్తే అది ఎప్పటికీ వక్ఫ్ భూమి అన్న వ్యాఖ్య అనేక వివాదాలకు కారణం అవుతోంది.
- కోర్టుల ఆదేశాలు ఈ ట్రైబ్యునల్‌కు వర్తించపోవడం మరింత వివాదం అవుతోంది.
- వక్ఫ్ ఆస్తుల సర్వే విషయంలో సర్వే కమిషనర్ పనితీరు ఆశాజనకంగా ఉండకపోవడంతో వక్ఫ్ చట్టంపై వ్యతిరేకత వస్తోంది.
- వక్ఫ్ ఆస్తుల సర్వేను ఇప్పటికీ గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు చేపట్టలేదు. ఉత్తరప్రదేశ్‌లో 2014లోనే సర్వేకు ఆదేశాలిచ్చినా ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
- వక్ఫ్ చట్టంలోని కొన్ని లొసుగులను ఆసరాగా చేసుకొని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు కూడా తప్పుడు పనులు చేస్తున్నట్టు తెలిసింది. వక్ఫ్ బోర్డుల చర్యలు వర్గాల మధ్య విభేదాలను పెంచుతున్నాయి.
- వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని మిస్ యూజ్ చేసినట్లు అనేక సందర్భాల్లో రుజువైంది.
ప్రశ్నలు.. సమాధానాలు:
వక్ఫ్ ఆస్తులను రికవరీ చేసుకోవచ్చా?
చేసుకోరాదు
అన్ని ఇస్లామిక్ దేశాలు వక్ఫ్ ఆస్తులను కలిగి ఉన్నాయా?
లేదు. టర్కీ, లిబియా, ఈజిప్ట్, సూడాన్, లెబనాన్, జోర్డాన్, సిరియా, ట్యునీషియా, ఇరాక్‌లో వక్ఫ్ అనేదే లేదు. భారత్‌లో వక్ఫ్ ఆస్తులు భారీగా ఉండటమే కాదు.. కాపాడేందుకు చట్టం కూడా ఉంది.
వక్ఫ్ బోర్డు నియంత్రణలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి?
ప్రస్తుతం వక్ఫ్ బోర్డు పరిధిలో 8.7 లక్షల ఆస్తులు ఉన్నాయి. ఆ భూముల విలువ రూ.1.2 లక్షల కోట్లు. ప్రపంచంలోనే వక్ఫ్ అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నది భారత్‌లోనే. భారత ఆర్మీ, రైల్వే శాఖ తర్వాత అత్యధిక భూములు కలిగి ఉన్నది వక్ఫ్ బోర్డే.
వక్ఫ్ బోర్డు పరిధిలో రిజిస్టర్ అయిన వక్ఫ్ ఎస్టేట్లు ఎన్ని?
3,56,071 వక్ఫ్ ఎస్టేట్లు
వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న స్థిరాస్తులు ఎన్ని?
8,72,328 స్థిరాస్తులు రిజిస్టర్ అయ్యాయి
వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న చరాస్తులు ఎన్ని?
16,713 చరాస్తులు రిజిస్టర్ అయ్యాయి
వక్ఫ్ బోర్డు వద్ద ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి?
మొత్తం 40,951 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 9,942 కేసులు ముస్లిం వర్గాల ప్రజలే వక్ఫ్‌పైన వేసిన కేసులు ఉన్నాయి.
వక్ఫ్ వివాదాలు:
తమిళనాడు-తిరుచెంతురాయ్ గ్రామం : ఈ గ్రామం మొత్తాన్ని వక్ఫ్ బోర్డు తన ఆస్తిగా ప్రకటించింది. దీంతో ఆ ఊరిలోని రైతులు తమ భూములు అమ్మకోవడానికి, బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి వీల్లేకుండా పోయింది.
బెంగళూరు ఈద్గా గ్రౌండ్ : ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఏ ముస్లిం సంస్థకూ ఈద్గా గ్రౌండ్‌ను రాసిచ్చినట్లు ఆధారాలు లేవు. కానీ వక్ఫ్ బోర్డు.. అది 1850 నుంచి వక్ఫ్ ఆస్తేనని స్పష్టం చేస్తోంది.
సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ : ఈ మధ్యే గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కూడా వక్ఫ్ ఆస్తేనని వక్ఫ్ బోర్డు వాదిస్తోంది. మొగలుల కాలంలో ఈ భవనాన్ని హజ్ యాత్రికుల కోసం వాడారు. బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ పాలకుల ఆధీనంలో ఉండేది. 1947లో ఆ భవనం భారత ప్రభుత్వానికి బదిలీ అయ్యింది. అయితే డాక్యుమెంట్లలో అప్‌డేట్ కాకపోవడంతో ఆ భవనం తమదేనని వక్ఫ్ బోర్డు అంటోంది.
వక్ఫ్ (సవరణ) బిల్లు పాసైతే..
- కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయవచ్చు.
- వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుంది.
- వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు ప్రాతినిథ్యం దక్కుతుంది.
- వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పర్యవేక్షణ జిల్లా కలెక్టర్లకు ఉంటుంది.
- ఏదైనా భూమిని, ఆస్తిని వక్ఫ్ బోర్డులు తమదిగా ప్రకటించలేవు.
- వక్ఫ్ బోర్డుల అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది.
- ఏ ఆస్తినీ స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు.
- ఒక ఆస్తి వక్ఫ్‌కి చెందినదా? కాదా? అని నిర్ణయించే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండదు.
- ముగ్గురు సభ్యుల వక్ఫ్ ట్రైబ్యునల్ ఇద్దరు సభ్యులకే పరిమితం కానుంది.
- ఈ ట్రైబ్యునల్ నిర్ణయాలు కూడా అంతిమం కావు.
- ట్రైబ్యునల్ నిర్ణయాలను 90 రోజుల్లో హైకోర్టులో సవాల్ చేయొచ్చు.