Fact Check : ఆపరేషన్ సిందూర్ 2.0.. సియాల్‌కోట్, రావల్పిండిలోనూ భారత ఆర్మీ దాడులు..

భారత ఆర్మీ తన దాడులను కొనసాగిస్తోందని.. సియాల్‌కోట్, రావల్పిండిలో లష్కరే తయ్యబా, జైషే మహ్మద్ బేస్ క్యాంపులపై దాడులు చేసిందని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోస్ట్ అయ్యాయి.

ఫ్యాక్ట్ చెక్
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ, ఈవార్తలు : బుధవారం తెల్లవారేసరికి భారత ప్రజలు ఒక గొప్ప వార్తను విన్నారు. భారత త్రివిధ దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందన్న వార్తే అది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో భారత ఆర్మీ వైమానిక దాడులు చేపట్టి ఉగ్ర స్థావరాలను తునాతునకలు చేసింది. 21 చోట్ల క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో పాకిస్థాన్‌ ప్రజలకు భారత ఆర్మీ దీపావళి రుచి చూపించిందని భారత ప్రజలు వ్యాఖ్యలు చేశారు. ఈ మెరుపు దాడుల అనంతరం..  పిక్చర్ అబి బాకీ హై అని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో మున్ముందు మరిన్ని దాడులు జరుగుతాయన్న క్లారిటీ వచ్చింది. పాకిస్థాన్‌కు ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లు అంతా అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం అర్ధరాత్రి మరో వార్త సోషల్ మీడియాలో గుప్పుమంది. భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0 చేపట్టిందనేదే ఆ పోస్టు సారాంశం.

భారత ఆర్మీ తన దాడులను కొనసాగిస్తోందని.. సియాల్‌కోట్, రావల్పిండిలో లష్కరే తయ్యబా, జైషే మహ్మద్ బేస్ క్యాంపులపై దాడులు చేసిందని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోస్ట్ అయ్యాయి. దీంతో మరోసారి భారత ఆర్మీ తన వీరత్వాన్ని ప్రదర్శించిందని వరుస పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఇదే పోస్టును ఢిల్లీ బీజేపీ సెక్రటరీ, బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఇంప్రీత్ సింగ్ భక్షి ట్వీట్ చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ సోషల్ మీడియా ప్రతినిధి అతుల్ కుశ్వాహా కూడా తన ట్విట్టర్ వాల్‌పై పోస్ట్ చేశారు. ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో ట్విట్టర్‌లో సియాల్‌కోట్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. అయితే, ఈ దాడికి సంబంధించి పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు పాతవి అని, అవి ఈ దాడికి సంబంధించినవి కావని తెలుస్తోంది. దీనిపై భారత ఆర్మీ లేదా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. భారత ఆర్మీని, భారత ప్రజలను తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా పోస్ట్ చేసేందుకు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్