రాజకీయాల్లో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ పేరు వింటే చాలు.. ఆయనో నిత్య సంచారి. ఎక్కడా కుదురుగా ఉండలేని నాయకుడు అంటుంటారు. ముఖ్యమంత్రి పీఠం కోసం తాను ఏ కూటమితో జట్టు కట్టడానికైనా, ఏ జట్టుతో విడిపోవడానికైనా వెనుకాడరు అన్న విమర్శలు ఉన్నాయి.
నితీశ్ కుమార్
న్యూఢిల్లీ, ఈవార్తలు : రాజకీయాల్లో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ పేరు వింటే చాలు.. ఆయనో నిత్య సంచారి. ఎక్కడా కుదురుగా ఉండలేని నాయకుడు అంటుంటారు. ముఖ్యమంత్రి పీఠం కోసం తాను ఏ కూటమితో జట్టు కట్టడానికైనా, ఏ జట్టుతో విడిపోవడానికైనా వెనుకాడరు అన్న విమర్శలు ఉన్నాయి. బీహార్‌లోని భక్తియార్‌పూర్‌లో జన్మించిన నితీశ్.. కుర్మీ వ్యవసాయ కులానికి చెందినవారు. ఆయన ముద్దు పేరు మున్నా. సోషలిస్టు వర్గానికి చెందిన ఈయన.. 1974-77 మధ్య జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. తొలిసారి 1985లో రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసి హర్నాట్ నుంచి గెలుపొందారు. వాజపేయి కేబినెట్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో తత్కాల్, ఆన్‌లైన్ టికెటింగ్ వంటి సంస్కరణలు చేపట్టారు. అయితే, గైసల్ రైలు దుర్ఘటనతో తన పదవికి 1999లో రాజీనామా చేశారు. మళ్లీ 2001-04 వరకు రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ మధ్యలో 2000 సంవత్సరంలో బీహార్ సీఎంగా పనిచేశారు.
అనంతరం 2005 నుంచి 2010 వరకు, 2010 నుంచి 2014 వరకు, 2015, 2015 నుంచి 2017 వరకు, 2017 నుంచి 2020 వరకు, 2020 నుంచి 2022 వరకు, 2022 నుంచి 2024 వరకు, 2024 నుంచి ప్రస్తుతం.. ఇలా తొమ్మిది సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ప్రస్తుతం ఆయన ఎన్డీయే పక్షాన ఉన్నా, ఏ క్షణంలో గోడ దూకుతారోనని ప్రజలు, నాయకులు మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం జేడీయూకు 12 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 272 బెంచ్ మార్కు దాటాలి. కానీ, బీజేపీ 241 వద్దే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీయూ సీట్లు కీలకం కానున్నాయి. అందుకే.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆయన ఎన్ని రోజులు ఎన్డీయేతో దోస్తీ కడతారో! చూడాల్సిందే.