One Nation One Election | జమిలి ఎన్నికలు అంటే.. వాటిని ఎలా నిర్వహిస్తారంటే..

ఒకే దేశం.. ఒకే చట్టం.. ఒకే ఎన్నిక.. దేశాన్ని ఐక్యం చేయాలన్న సంకల్పంతో కేంద్రంలోని మోదీ సర్కారు ముందుకు సాగుతోంది. అందులోభాగంగానే జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అయితే, జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమా? నిర్వహిస్తే లాభాలేంటి? నష్టాలేంటి? అసలు ఇంతకుముందు భారతదేశంలో జమిలి ఎన్నికలు జరిగాయా? ప్రపంచంలో ఏయే దేశాలు జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్నాయి? తదితర అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశాలుగా మారాయి.

one nation one election

ప్రతీకాత్మక చిత్రం

ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. అదే జమిలి ఎన్నిక. అంటే.. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదన 1980లోనే వచ్చింది. జస్టిస్‌ జీవన్‌ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్‌ మే 1999లో జమిలి ఎన్నికలు జరగాలని సూచించింది. అయితే, ఆ సమయంలో వీలు కాలేదు. ప్రస్తుత బీజేపీ సర్కార్‌.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే కేంద్ర క్యాబినెట్‌ ముందుకు సాగుతోంది.

ఒకే దేశం.. ఒకే చట్టం.. ఒకే ఎన్నిక.. దేశాన్ని ఐక్యం చేయాలన్న సంకల్పంతో కేంద్రంలోని మోదీ సర్కారు ముందుకు సాగుతోంది. అందులోభాగంగానే జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అయితే, జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమా? నిర్వహిస్తే లాభాలేంటి? నష్టాలేంటి? అసలు ఇంతకుముందు భారతదేశంలో జమిలి ఎన్నికలు జరిగాయా? ప్రపంచంలో ఏయే దేశాలు జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్నాయి? తదితర అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశాలుగా మారాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర కేబినెట్‌లో ఆమోదం పొందడమే కాకుండా.. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లును ఆమోదింపజేయాలని మోదీ సర్కారు కృతనిశ్చయంతో ఉంది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచే బీజేపీ జమిలి అంశాన్ని సందర్భానుసారం లేవనెత్తుతోంది. 2014 బీజేపీ మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది.

బీజేపీ పట్టుబట్టి మరీ..

జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీకి లేదా ఒకే కూటమికి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని పబ్లిక్‌ పాలసీ మేథో సంస్థ ఐడీఎఫ్‌సీ చేసిన సర్వేల్లో తేలింది. అదే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఆరు నెలల గ్యాప్‌తో నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకొనే అవకాశాలు 61 శాతానికి తగ్గిపోతాయట. ఏడాది గ్యాప్‌తో ఎన్నికలు జరిగితే ప్రభావం మరింత తగ్గే అవకాశాలు ఉంటాయట. 1952 నుంచి 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించి ఆ సంస్థ ఓ నివేదికను తయారుచేసిందది. జాతీయ అంశాల ప్రాతిపదికన ఓటు వేస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాని ప్రభావం ఉంటుందని సర్వే స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన మోదీ ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. 

జమిలి ఎన్నికలు సాధ్యమేనా?

దేశంలోని 14 రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం పొందాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉన్నది. కాబట్టి జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమేనని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలే జరిగాయి. ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడం, కొన్ని సందర్భాల్లో ముందే అసెంబ్లీని రద్దు చేయడం వంటి ఘటనల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పద్ధతే మారిపోయింది. అయితే, ప్రస్తుతం జమిలి ఎన్నికలు బెల్జియం, స్వీడన్‌, సౌతాఫ్రికా వంటి దేశాల్లో జరుగుతున్నాయి.

జమిలి ఎన్నికలతో లాభాలు:

కొన్ని నివేదికల ప్రకారం.. 2019 లోక్‌సభ ఎన్నికలకు రూ.60 వేల కోట్లు ఖర్చు అయ్యింది. ఇందులో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం ఖర్చులు ఉంటాయి. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ఎన్నికల ఖర్చును తగ్గించవచ్చు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే పాలనాపరమైన పనులపై ఎలాంటి ప్రభావం పడదని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రాల్లో ఒక్కో సమయంలో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజాధనం వృథాతోపాటు, సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం పడుతోందని చెప్తున్నారు. అంతేకాకుండా.. సమయం, సందర్భం లేకుండా వచ్చే ఎన్నికల కోడ్‌ వంటి సమస్యలు తప్పుతాయి. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వాలకు అవకాశం ఏర్పడుతుంది. ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం చాలా తగ్గుతుంది. ఓటింగ్‌ శాతం పెరుగుతుంది. డబుల్‌ ఓటింగ్‌కు చెక్‌ పడుతుంది. ఒకే దఫాలో ఎన్నికలు పూర్తయ్యి పార్టీలకు నిర్వహణ ఖర్చు తగ్గుతుంది.

జమిలి ఎన్నికలతో నష్టాలు:

రాష్ట్రాల్లో దశాబ్దాలకొలది వేళ్లూనుకున్న ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియతో స్థానిక సంస్థల సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు అంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఓటర్లు ఒకే పార్టీకి పట్టం కట్టే అవకాశమూ లేకపోలేదని, తద్వారా స్థానిక పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా, భారత్‌ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టం. పారదర్శకతపై అనుమానాలు కలిగే అవకాశాలు ఉంటాయి. జమిలి ఎన్నికలపై పై రాజ్యాంగంలో ప్రస్తావన లేదు కాబట్టి, ఇప్పటికైతే ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగానికి సవరణ చేయాలి. గడువులోపే ప్రభుత్వాలు పడిపోతే జమిలి లక్ష్యం దెబ్బతింటుంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరిగే చాన్స్‌ ఉంది. జమిలి ఎన్నికలతో జాతీయ పార్టీలకు మేలు జరుగుతుంది. జమిలి నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరం అవుతాయి.

చేయాల్సిన రాజ్యాంగ సవరణలు:

లోక్‌సభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్‌ 83 సవరణ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్‌ 172(1)ని సవరించాలి.

ఎమర్జెన్సీ లాంటి పరిస్థితుల సమయంలో సభ కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్‌ 83(2)కు సవరణ చేయాలి.

లోక్‌సభను రద్దు చేసే రాష్ట్రపతికి అధికారాలిచ్చే ఆర్టికల్‌ 85 (2) (బి)ని సవరించాలి.

రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు ఉండే ఆర్టికల్‌ 174 (2) (బి)కి సవరణ చేయాలి.

రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్‌ 356ను సవరించాలి.

ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 324ను కూడా సవరించాల్సి ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్