పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా ఆర్జీ కర్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన మహిళా వైద్యురాలికి న్యాయం చేయాలంటూ జూనియర్ వైద్యులు గడిచిన కొద్ది రోజుల నుంచి నిరసన చేపడుతున్నారు. ఈ నిరసన దీక్ష శిబిరానికి శనివారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ జూనియర్ వైద్యులతో చర్చలు జరిపారు. విధుల్లో చేరాలంటూ ఆమె వైద్యులను కోరారు. అనంతరం మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ.. తాను ఈ దీక్షా శిబిరానికి ముఖ్యమంత్రి హోదాలో రాలేదని, తాను ఒక సోదరిగా మాత్రమే వచ్చానని పేర్కొన్నారు.
దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా ఆర్జీ కర్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన మహిళా వైద్యురాలికి న్యాయం చేయాలంటూ జూనియర్ వైద్యులు గడిచిన కొద్ది రోజుల నుంచి నిరసన చేపడుతున్నారు. ఈ నిరసన దీక్ష శిబిరానికి శనివారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ జూనియర్ వైద్యులతో చర్చలు జరిపారు. విధుల్లో చేరాలంటూ ఆమె వైద్యులను కోరారు. అనంతరం మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ.. తాను ఈ దీక్షా శిబిరానికి ముఖ్యమంత్రి హోదాలో రాలేదని, తాను ఒక సోదరిగా మాత్రమే వచ్చానని పేర్కొన్నారు. అత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వస్థ భవన్ ఎదుట జూనియర్ వైద్యులు గడిచిన నెల రోజుల నుంచి ఆందోళన సాగిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం సీఎం మమతా బెనర్జీ నేరుగా దీక్ష సాగిస్తున్న వైద్యుల వద్దకు వెళ్లారు. మమతా బెనర్జీని చూడగానే జూనియర్ వైద్యులు న్యాయం కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇదే తన చివరి ప్రయత్నం అంటూ పేర్కొన్నారు. గతంలో తాను విద్యార్థి నాయకురాలిగా ఉద్యమాల్లో పాల్గొన్నానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఆందోళన చేయడం మీ హక్కు అంటూ పేర్కొన్న మమతా బెనర్జీ.. సమస్యను పరిష్కరించేందుకు మీతో చర్చల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది వద్దని చెప్పినప్పటికీ మీ ఆందోళనలకు సెల్యూట్ చేసేందుకు వచ్చానంటూ ఆమె వెల్లడించారు. ఇక్కడికి తాను ముఖ్యమంత్రిగా రాలేదని, మీ సోదరిగా వచ్చానంటూ స్పష్టం చేశారు. తనకు సీఎం పదవి ముఖ్యం కాదని, తానొక్కదాన్నే ప్రభుత్వాన్ని నడపట్లేదని పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎండ, వానలోనూ మీరు రోడ్లపై ఆందోళన చేస్తుంటే తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్న అంటూ మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. మీ డిమాండ్లను కచ్చితంగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో రోగుల సంరక్షణ కమిటీ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని సిబిఐని కోరుతున్నట్లు వెల్లడించారు. తనమీద విశ్వాసం ఉంటే చర్చలకు రావాలని ఈ సందర్భంగా వైద్యులను ఆమె కోరారు. వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని, వైద్యులపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. అయితే, తమ డిమాండ్లపై చర్చ జరిగే వరకు రాజీకి వచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో సీఎం మమతా బెనర్జీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఆర్జీ కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ఘటనను సిబిఐ విచారిస్తోంది. ఇందులో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో భాగంగా పలువురికి లై డిటెక్టర్ పరీక్షలను నిర్వహించారు. ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ ను భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనను పలుమార్లు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఆయనకు కూడా లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. కొద్ది రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి పురోగతి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ వైద్యులు చేస్తున్న దీక్షా శిబిరం వద్దకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.