మన ఇంట్లో పిల్లలు చదవకపోతే బర్రెలా తింటావ్.. గానీ చదువు అంటే బుర్రకెక్కదు! అని తిడుతుంటాం. గేదె తెలివిని తక్కువ చేసి చూసే క్రమంలో అలా అంటుంటాం. అయితే, తెలివిలో తాము తక్కువేమీ కాదని నిరూపించిందో గేదె.
ప్రతీకాత్మక చిత్రం
మన ఇంట్లో పిల్లలు చదవకపోతే బర్రెలా తింటావ్.. గానీ చదువు అంటే బుర్రకెక్కదు! అని తిడుతుంటాం. గేదె తెలివిని తక్కువ చేసి చూసే క్రమంలో అలా అంటుంటాం. అయితే, తెలివిలో తాము తక్కువేమీ కాదని నిరూపించిందో గేదె. పంచాయితీ పెద్దలు ఇవ్వలేని సమస్యకు తీర్పు ఇచ్చి వహ్వా! అనిపించింది. తన యజమాని గౌరవాన్ని కాపాడి తాను తెలివైనదానిని అని చెప్పుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా మహేశ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్షరాంపూర్ గ్రామానికి చెందిన నందలాల్ సరోజ్ పలు గేదెలను సాదుతున్నాడు. అందులో ఒక గేదె కొన్ని రోజుల క్రితం తప్పిపోయి, పక్కనున్న పూరే హరికేశ్ గ్రామానికి చేరుకుంది. ఆ గ్రామానికి చెందిన హనుమాన్ అనే వ్యక్తి ఆ గేదెను ఇంట్లో కట్టేసుకున్నాడు.
నందలాల్ గేదె కోసం చాలా రోజుల పాటు వెతగ్గా, హనుమాన్ వద్ద ఉందని సమాచారం అందింది. దాంతో వెంటనే అతడి ఇంటికి వెళ్లి తన గేదెను ఇచ్చేయాలని అడిగాడు. తానెందుకు ఇస్తానని, అది తన గేదె అని హనుమాన్ వాదించాడు. అతడితో వాదించి లాభం లేదనుకున్న నందలాల్ నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసి, పంచాయితీ పెద్దల వద్దకు వెళ్లి పరిష్కారం చూపాలని కోరాడు. పంచాయితీ పెద్దలు వారిద్దరిని పిలిపించి ప్రశ్నించగా, గేదె తనదేనంటూ ఇద్దరూ వాదించారు. దాంతో పంచాయితీ పెద్దలు ఏం చేయలేక తలలు పట్టుకున్నారు. దీంతో సీన్‌లోకి ఎంటరైన పోలీస్ స్టేషన్ అధికారి.. ఓ ఉపాయాన్ని ఆలోచించారు. ఆ గేదెను రెండు గ్రామాల మధ్య నిల్చోబెట్టి.. అది ఎవరి ఇంటికి వెళ్తే అతడే దాని యజమాని అని ప్రకటించారు. దానికి నందలాల్, హనుమాన్ ఓకే చెప్పారు. గ్రామస్థులు కూడా సరైన ఉపాయమేనని సమ్మతించారు.
పోలీసులు, గ్రామస్థుల సమక్షంలో ఆ గేదెను తీసుకొచ్చి రెండు గ్రామాల మధ్యలో విడిచిపెట్టారు. ఆ గేదె నందలాల్ ఇంటి వైపు వెళ్లి.. ఇంటికి చేరింది. దీంతో నందలాలే అసలైన యజమాని అని పోలీసులు, పంచాయితీ పెద్దలు ప్రకటించారు. హనుమాన్‌ను మందలించి వదిలేశారు. గేదె తన గౌరవాన్ని కాపాడిందని నందలాల్ మురిసిపోయాడు. తన యజమానిని గుర్తించి, గేదె తన తెలివిని నిరూపించుకుంది.