అదానీ భారత, అమెరికా చట్టాలను ఉల్లంఘించారని, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారని, అయినా ఇంత స్వేచ్ఛగా ఎలా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : అదానీ భారత, అమెరికా చట్టాలను ఉల్లంఘించారని, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారని, అయినా ఇంత స్వేచ్ఛగా ఎలా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. అదానీని ఎవరు కాపాడుతున్నారో దేశ ప్రజలందరికీ తెలుసని.. అదానీ ఏకంగా రూ.2 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయనను ప్రధాని మోదీ కాపాడుతున్నారని.. అందుకే ఇంకా అరెస్టు చేయడం లేదని విమర్శించారు. అదానీ ఏం చేశాడో మేం దేశ ప్రజలకు చెప్పగలిగామని పేర్కొన్నారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఈ సమస్యను లేవనెత్తడం నా బాధ్యత. ఆ వ్యక్తి అవినీతి ద్వారా దేశ ఆస్తులను దోచుకుంటున్నాడు. బీజేపీకి మద్దతు తెలుపుతున్నాడు. దీనిపై జేపీసీకి డిమాండ్ చేస్తున్నా. అదానీని వెంటనే అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
కాగా, తెలంగాణలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకోవడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పేదొకటి.. చేసేదొకటి అని మండిపడుతున్నారు. తెలంగాణలో మూసీ ప్రక్షాళన, స్కిల్ డెవలప్‌మెంట్‌లో అదానీకి భాగస్వామ్యం కల్పించడాన్ని గుర్తుచేస్తూ రాహుల్ గాంధీ దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీస్తున్నారు. అధికారం కోసం ఇంతలా పాకులాడుతారు అనడానికి ఇదే నిదర్శనం అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.