||మీడియాతో మాట్లాడుతున్న కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్ Photo: PIB||
ఈవార్తలు, నేషనల్ న్యూస్: చేతివృత్తుల వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విశ్వకర్మ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే (నేడు) ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు ఇవ్వనున్నారు. బుధవారం కేంద్ర మంత్రి వర్గ సమావేశం తర్వాత కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. పథకం వివరాలు వెల్లడించారు.
‘పీఎం విశ్వకర్మ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి గరిష్ఠంగా 5 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందజేయనున్నాం. ఇందుకోసం కేంద్రం రూ.13 వేల కోట్లు కేటాయించింది. చేతి వృత్తులు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారి కోసం ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలు చేపడతాం. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో శిక్షణ ఇస్తాం. శిక్షణ పూర్తయ్యాక పరికరాల కొనుగోలు కోసం రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తాం’ అని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
పరికరాల కొనుగోలు అనంతరం వడ్డీపై రాయితీతో రూ.లక్ష రుణం ఇస్తామని తెలిపారు. తొలి విడత సద్వినియోగం చేసుకున్న అనంతరం, రూ.2 లక్షల రుణం మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ పథకానికి ఓబీసీకి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతలు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకులు లబ్ధిదారులని కేంద్ర మంత్రులు తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
కేంద్ర కేబినెట్ మరిన్ని నిర్ణయాలు:
పీఎం ఈ-బస్ సేవ: ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.57,613 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో కేంద్రం రూ.20 వేల కోట్లు సమకూర్చనుంది.
డిజిటల్ ఇండియాకు ఆమోదం: డిజిటల్ ఇండియా కోసం రూ.14,903 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా 5.25 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. 9 సూపర్ కంప్యూటర్లను అందుబాటులోకి తెస్తారు.
7 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు: 7 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల కోసం రూ.32,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు.