|| నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ||
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం అయ్యే బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 11 గంటలకు స్వామివారి కల్యాణం, 5వ తేదీన సాయంత్రం 4 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొంది. భక్తులందరూ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది.
ఏటా భారీ జాతర
శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏటా నల్లగొండలో భారీ జాతర జరుగుతుంది. సమీప జిల్లాలు, ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. పౌర్ణమి నాడు జరిగే పండుగ కన్నులపండువగా సాగుతుంది. స్వామివారికి కోరమీసాలు, పట్టెనామాల మొక్కులు చెల్లిస్తే కోరిక తీరుతుందని భక్తుల విశ్వాసం. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ నుంచి ఇక్కడికి చేరుకొనేందుకు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ఆలయం అటు వేములవాడకు, ఇటు కొండగట్టుకు మధ్యలో ఉంటుంది.