రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులో అందించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. సంక్రాంతి పండగ నాటికి రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా దరఖాస్తులను స్వీకరించి ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశించింది. అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో సంక్రాంతి నాటికి కొత్త కార్డుల మంజూరయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.
రేషన్ కార్డులు
రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులో అందించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. సంక్రాంతి పండగ నాటికి రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా దరఖాస్తులను స్వీకరించి ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశించింది. అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో సంక్రాంతి నాటికి కొత్త కార్డుల మంజూరయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త కార్డులతోపాటు స్పిట్ కార్డులు, ఉన్న కార్డులో సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామాల మార్పుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3.40 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులన్నీ గడిచిన కొద్ది నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన పేదలందరికీ కొత్త కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అదే సమయంలో గత వైసిపి ప్రభుత్వం ఆ పార్టీకి చెందిన రంగులతో ఇచ్చిన పాత కార్డులను తొలగించి వాటి స్థానంలో కొత్త కార్డులు అందించేందుకు డిజైన్ పై కసరత్తు చేసింది.
త్వరలోనే కొత్త కార్డులను మంజూరు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్త కార్డుల డిజైన్ పై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. వీటిపై ప్రభుత్వం నిర్ణయానికి తీసుకోవాల్సి ఉంది. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించిన ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు, ఇతర సర్వీసులకు ఈనెల రెండో తేదీ నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుందని అంతా భావించారు. దీంతో రేషన్ కార్డులు కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది అర్హులైన వారంతా గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇంత వరకు ప్రభుత్వం నుంచి వెలువడలేదు. దరఖాస్తులు చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. దీంతో కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ మరింత జాప్యం జరుగుతుందని అంతా భావిస్తున్నారు. దీనిపై ఎప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో సంక్రాంతి నాటికి కొత్త కార్డులు వస్తాయని ఆశించిన ఎంతోమందికి నిరాశ ఎదురయింది.