వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులుగా మెలిగిన, ఉన్నత పదవులు అనుభవించిన ఎంతోమంది నాయకులు ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా జరుగుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి వస్తున్న నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నాయకులు వైసీపీని వీడి టిడిపి, జనసేనలో చేరిపోయారు. తాజాగా మరి కొంతమంది ముఖ్య నాయకులు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ తో బాలినేని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులుగా మెలిగిన, ఉన్నత పదవులు అనుభవించిన ఎంతోమంది నాయకులు ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా జరుగుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి వస్తున్న నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నాయకులు వైసీపీని వీడి టిడిపి, జనసేనలో చేరిపోయారు. తాజాగా మరి కొంతమంది ముఖ్య నాయకులు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ జాబితాలో వైసీపీకి అత్యంత కీలకమైన నాయకులు ఉండడం గమనార్హం. వైసీపీతో గత కొద్ది రోజుల నుంచి తీవ్రంగా విభేదిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బంధువైన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జనసేనలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రెండు రోజుల కిందట కలిసి పలు అంశాలపై ఆయన చర్చించారు. ఈయన ఆదివారం పార్టీలో చేరుతారని చెబుతున్నారు. అలాగే, మరో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైసీపీని వీడారు. ఆయన కూడా జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇద్దరు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆదివారం పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఈ జాబితాలో మరో కీలక నాయకుడు కూడా చేరినట్లు తెలుస్తోంది. ఆయనే వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గ నుంచి పోటీ చేసి విజయం సాధించిన రోశయ్య 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ పై కిలారు రోశయ్య ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న ఆయన తాజాగా జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన ముఖ్య నాయకులతో చర్చించిన ఆయన ఆదివారం ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ముగ్గురు కీలక నేతలు ఒకేసారి జనసేనలో చేరుతుండడంతో వైసిపి ఆత్మ రక్షణలో పడిపోయినట్లు అయింది. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చే నాయకుల విషయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందరినీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ పట్ల ఉన్న అభిప్రాయం ప్రజల్లో పోతుందన్న భావనను ఆయన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చే మంచి నాయకులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న నేతలను దూరంగా పెట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో కేసుల నుంచి బయటపడేందుకు జనసేనను వేదికగా చేసుకోవాలనే వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. పార్టీకి ఎల్లవేళలా అండగా ఉంటారని భావించే నాయకులకు మాత్రమే పవన్ కళ్యాణ్ పార్టీలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని జనసేనకు చెందిన ముఖ్య నాయకులు చెబుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించాలని భావించే నేతలను పార్టీ దగ్గరలోకి కూడా ఆయన రానీయడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైసిపి దారుణమైన పరిస్థితులను తొలిసారి ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి నుంచి వైసీపీ ఎలా గట్టెక్కుతుందో చూడాల్సి ఉంది.