||విద్యార్థులకు ప్రోత్సాహక పత్రాలను అందిస్తున్న అధికారులు||
ఈవార్తలు, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బీ రాహుల్ చొరవతో ఐదుగురు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రెండేండ్ల పాటు ఉచితంగా చదువుకోనున్నారు. విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభను వెలికితీసేందుకు అదనపు కలెక్టర్ రాహుల్.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ మధ్యే ప్రతిభ ప్రోత్సాహక పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని అవినాశ్ కాలేజెస్ ఆఫ్ కామర్స్.. ముగ్గురు విద్యార్థులను చదివించే బాధ్యత తీసుకుంది. ఆ ముగ్గురు విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ఏ కాలేజీలోనైనా, ఏ కోర్సులోనైనా సరే వారిని చదివిస్తామని తెలిపింది. వారికి హాస్టల్ వసతికి అయ్యే ఖర్చును భరిస్తామని వెల్లడించింది. అంతేకాదు.. మరో ఇద్దరు విద్యార్థులు కామర్స్ కోర్సులో చేరితే తమ కాలేజీలో ఉచితంగా చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చింది.
ఈ మేరకు మంగళవారం మంచిర్యాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. మరో 10 మంది విద్యార్థులకు ప్రతిభ ప్రోత్సాహక పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు, అవినాశ్ కాలేజెస్ ఆఫ్ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ హెడ్ డాక్టర్ సాయికుమార్, డైరెక్టర్ సంతోష్, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి భీంరావు, సహాయ కార్యదర్శి దేవసాని కుమారస్వామి, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.