(ఫొటో: మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ రాహుల్ రాసిన లేఖ)
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: విద్యార్థులు బాగా చదువుకోవాలంటే.. మంచి టీచర్ ఉండాలి. మంచి టీచర్ ఉంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. అలాంటి టీచర్లను ప్రోత్సహిస్తే విద్యార్థుల కోసం మరింత కష్టపడి పనిచేయగలుగుతారు. ఇప్పుడు ఆ టీచర్లను ప్రోత్సహించే గొప్ప కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్, ఐఏఎస్ అధికారి రాహుల్. ఈ మధ్యే మంచిర్యాల జిల్లా బాధ్యతలు చేపట్టిన ఆయన.. పాలనలో తనదైన మార్క్ చూపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను నిరంతరం తనిఖీ చేస్తూ, బోధన మెరుగ్గా సాగేలా కృషి చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ మధ్యే అడిషనల్ కలెక్టర్ ఓ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలోని ఓ తరగతి గదికి వెళ్లిన ఆయన.. విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా జవాబు ఇచ్చారు. విద్యార్థుల ప్రతిభ, టీచర్లు చదువు చెప్తున్న తీరు ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. అంతటితో ఆగలేదు.. ఇంటికి తిరిగొచ్చి ప్రత్యేకంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తానే స్వయంగా లేఖ రాసి, అభినందించారు. విద్యార్థులు అప్పజెప్పిన వేమన పద్యాలు, నీతి వాక్యాలు చాలా బాగా చెప్పారని, చిన్న వయసులోనే ఆరాధ్య అనే విద్యార్థిని పాడిన జయజయహే తెలంగాణ పాట తనకు ఎంతగానో నచ్చిందని ఆ లేఖలో పేర్కొన్నారు. చాలా బాగా పనిచేస్తున్నారని, కృషిని ఇలాగే కొనసాగించాలని సూచించారు. ఇప్పుడా లెటర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎంతైనా ఐఏఎస్, అదీ యువకుడు అంటే ఆ మాత్రం ఫైర్ ఉండాల్సిందే. అలాంటివారే కదా మన సమాజానికి కావాల్సింది. ఫైనల్లీ.. స్పెషల్ థ్యాంక్స్ టు అడిషనల్ కలెక్టర్ రాహుల్.