ప్రధాని నరేంద్ర మోడీపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు విసిరారు. తనను కలిసిన తెలంగాణ బిజెపి నేతలతో కలిసి పనిచేసే తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కృషి చేయాలంటూ ప్రధాన మోడీ బిజెపి నేతలకు సూచించారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గురువారం స్పందించారు. తెలంగాణలోని కమలం నేతలు కలిసికట్టుగానే కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పని చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మోడీ గారు మీ నేతలంతా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు.
భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ప్రధాని నరేంద్ర మోడీపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు విసిరారు. తనను కలిసిన తెలంగాణ బిజెపి నేతలతో కలిసి పనిచేసే తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కృషి చేయాలంటూ ప్రధాన మోడీ బిజెపి నేతలకు సూచించారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గురువారం స్పందించారు. తెలంగాణలోని కమలం నేతలు కలిసికట్టుగానే కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పని చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మోడీ గారు మీ నేతలంతా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. చోటేభాయ్ కు వ్యూహకర్తగా, కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా విశ్రమించకుండా పని చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం 'చేతి' కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరుమెదపరని, దీనిని బట్టి వీరి రహస్య ఎజెండా అర్థమవుతోందంటూ ఆరోపించారు. రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా మంచిదంటారని, మూసి కావాలంటారని, ఏమన్నా అంటే నిద్ర నటిస్తారని బిజెపి నేతలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారే తప్ప స్పందించరంటూ కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉందని.. జాగ్రత్తగా! భద్రంగా! అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు.
నాకేం సిగ్గు అన్నట్టుగా ప్రభుత్వ వ్యవహార శైలి..
సిగ్గు లేదా జీడిగింజా అంటే-నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట అంటూ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందించారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి-రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి, పంటల కొనుగోళ్లకు శఠగోపం పెట్టి - ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఎగ్గొట్టి ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ ఆరోపించారు. దిలావర్ పూర్ లో దమనకాండ సృష్టించి - రామన్నపేటను రావణకాష్టం చేసి - లగచర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్ళలో ఆనందం చూసినందుకా రైతు పండుగలు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. పండుగలు మీకని, పస్తులు రైతులకంటూ విమర్శించారు. చెప్పింది బారాణ -చేసింది చారాణ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తయారైందని వ్యాఖ్యానించారు. కల్లాల్లో ధాన్యం పోసి, కళ్లల్లో వత్తులు వేసుకొని రైతులు కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారని, నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అడ్డికి పావుశేరు లెక్కన దళారులకు అమ్ముకుంటున్నారని, అబద్దానికి అంగీ, లాగు తొడిగితే అది కాంగ్రెస్ సర్కార్ అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని విజయోత్సవాలు జరుపుకుంటూందని విమర్శించారు. రైతును నిండా ముంచినందుకా, వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా ఈ విజయోత్సవాలు అని ప్రశ్నించారు. నీ గుడ్డి గుర్తులు, కాకి లెక్కలు, కల్లబొల్లి కబుర్లతో ఎల్లకాలం కాలం వెళ్లదీయలేవని రేవంత్ రెడ్డిని విమర్శించిన కేటీఆర్.. జాగో తెలంగాణ జాగో అంటూ ముగించారు.