కొండా సురేఖ తన పట్ల చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్‌పై అసత్యాలు మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ ఆగ్రహం.. నాంపల్లి కోర్టు లో పరువునష్టం దావా
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఇవాళ( గురువారం) హైదరాబాద్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరఫు లాయర్ ఉమామహేశ్వరరావు దావా దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, తుల ఉమను సాక్షులుగా తెలిపారు. పిటిషన్ ఫై కోర్టు విచారణ చేపట్టింది.
కొండా సురేఖ తన పట్ల చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్‌పై అసత్యాలు మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో పాటు నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారని, కేవలం తన గౌరవానికి, ఇమేజ్‌కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారని.. మహిళ అయి ఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ టాపింగ్, ఇతర అంశాలపైన కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని కేటీఆర్ లీగల్ నోటీసులో తెలిపారు.
మరోవైపు సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు కోర్టు తెలిపింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. ఇవాళ రెండో సాక్షి స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది. ఇప్పటికే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది. కొండా సురేఖ తన కుటంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నాగార్జున పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.