తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సోమవారం నుంచి నూతన పాలసీని అమల్లోకి తీసుకువస్తున్నారు. కొత్తగా ఇవి వెహికల్స్ కొనుగోలు చేసే వారికి భారీగా లబ్ధి చేకూరనుంది.
ఎలక్ట్రికల్ వాహనాలు
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సోమవారం నుంచి నూతన పాలసీని అమల్లోకి తీసుకువస్తున్నారు. కొత్తగా ఇవి వెహికల్స్ కొనుగోలు చేసే వారికి భారీగా లబ్ధి చేకూరనుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో కాలుష్యం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కేంద్రం ప్రజల్లో ఇవి వాహనాలపై అవగాహన పెరిగేలా అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ దిశగానే తెలంగాణ ప్రభుత్వం కూడా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు చేసే వారికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తోంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఎలక్ట్రికల్ వాహనాలకు రోడ్ టాక్స్, వాహన రిజిస్ట్రేషన్ ఫీజును 100% మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాహన కాలుష్యం తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సరికొత్త విధానం సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఆయన ప్రకటించారు. ఎలక్ట్రికల్ వాహనం ఏ కంపెనీ అయినా ఈ ప్రోత్సాహకం అందనుంది. గతంలో కెసిఆర్ ప్రభుత్వం పరిమిత సంఖ్యలో వాహనాలకే ఈవీ పాలసీని రూపొందించి అమలు చేసిందని, తమ ప్రభుత్వం అన్ని వాహనాలకు ఈ ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీ మేరకు 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యే అన్ని ఎలక్ట్రికల్ వాహనాలకు ఇది వర్తిస్తుంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే అంశంపై ఆలోచన చేస్తామని కూడా మంత్రి వెల్లడించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వం ఏటా వందల కోట్ల ఆదాయం నష్టపోవాల్సి వస్తుందని మంత్రి తెలిపారు. టు వీలర్, కార్లు, ఆటోలు, ఆర్టీసీతోపాటు ఐటీ, ఫార్మా సహా ఇతర కంపెనీలు తమ ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రికల్ బస్సులు కొంటే రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపు ఇస్తామని మంత్రి వెల్లడించారు. నూతన పాలసీకి సంబంధించిన జీవో 41 రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జారీ చేశారు. అన్ని రకాల ఎలక్ట్రికల్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపు ఇస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. తాజా నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలుకు భారీగా ప్రోత్సాహకాలను అందిస్తున్న నేపథ్యంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వాళ్లంతా తప్పనిసరిగా ఈవీ వైపు చూస్తారని ఈ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.