||స్వీట్లు పంచుకుంటున్న జేఎన్‌జే సభ్యులు||
(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పును తమ జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ స్వాగతిస్తోందని ఆ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఆ సంఘం పత్రికలకు ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వెల్లడించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పట్ల జర్నలిస్టుల పక్షాన సొసైటీ వ్యవస్థాపక సభ్యుడు పీవీ రమణారావు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి ఇచ్చిన హామీ ప్రకారం బషీరాబాద్‌లోని 38 ఎకరాల స్థలాన్ని తమకు అప్పగించాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15 ఏండ్ల సీనియర్ జర్నలిస్టుల కలలను సహకారం చేస్తారని ఆశిస్తున్నామని రమణారావు అన్నారు. మరో మారు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధికారంలో ఉండేందుకు జర్నలిస్టులుగా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సాధించడం పట్ల సభ్యులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ముందు పెద్ద ఎత్తున స్వీట్లు పంచుకున్నారు.