మూడోసారి అధికారంలోకి వస్తే జమిలి ఎన్నికలు : అమిత్ షా

కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా


కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. యుసీసీ.. స్వాతంత్రానంతరం రాజ్యాంగ రూపకర్తలు పార్లమెంటు, శాసనసభలకు వదిలి వెళ్ళిన బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతి అనేది భారీ సామాజిక, చట్ట, మతపరమైన సంస్కరణ అని పేర్కొన్న అమిత్ షా.. ఉత్తరాఖండ్ లో బిజెపి ప్రభుత్వం దీనిపై ఓ ప్రయోగాన్ని చేపట్టిందన్నారు. ఈ చట్టంపై విస్తృత చర్చ జరుగుతోందని, దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే న్యాయస్థానం అభిప్రాయం కూడా తెలుస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు. అదే సమయంలో జమిలి ఎన్నికలపైనా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాన మోడీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం అన్న అమిత్ షా.. తాము మతప్రాతిపదికన ప్రచారం చేయడం లేదని స్పష్టం చేశారు. 370 అధికరణ రద్దు, యుసిసి, మతప్రాతిపదికన ముస్లిం కోటాను వ్యతిరేకించడం మత ప్రచారమే అయితే.. బిజెపి కచ్చితంగా అదే పని చేస్తుందని అమిత్ షా తేల్చి చెప్పారు. పోలింగ్ డేటా, ఈవీఎంలపై విపక్షాలు అనవసరంగా యాగి చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఈవీఎంలే ఉన్నాయని, ఆయా రాష్ట్రాల్లో బిజెపి ఓడిపోయిందన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలని సూచించారు. జూన్ 5వ తేదీ తర్వాత విదేశాలకు విహారయాత్రలకు వెళ్లేందుకు ప్రతిపక్షాలు సాకులు వెతుక్కుంటున్నాయని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. ఈవీఎంలతో రిగ్గింగ్ సాధ్యం కాదని, రిగ్గింగ్ జరిగే విధానం కావాలని కాంగ్రెస్ అడుగుతోందని మండిపడ్డారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల్లో ఎన్డీఏ ఖచ్చితంగా 400 సీట్ల లక్ష్యాన్ని సాధిస్తుందని, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బిజెపి ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏకు 17 ఎంపి స్థానాలు వస్తాయని, బెంగాల్లో 42 స్థానాలకు గాను 24 నుంచి 30, ఒడిశాలో 21 స్థానాలకు గాను 16 వస్తాయని అమిత్ షా పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్